సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన క్రాక్ సినిమాకు మాంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. తర్వాత పండక్కి మూడు సినిమాలు రిలీజవుతుండటంతో ఇది ఏమేర బాక్సాఫీస్ పరీక్షకు నిలుస్తుందో అని అందరూ సందేహించారు. ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. మిగతా సంక్రాంతి సినిమాల ధాటికి నిలబడదేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు క్రాక్ ధాటికి మిగతా సంక్రాంతి సినిమాలే తట్టుకోలేని పరిస్థితి నెలకొంది.
మిగతా మూడు చిత్రాల లెక్క తేలిపోయాక క్రాక్ ఉన్నట్లుండి బలంగా పుంజుకుంది. వీకెండ్లో ఆ సినిమాదే హవా అంతా. సంక్రాంతి రోజు విడుదలైన రెండు కొత్త సినిమాలకు దీటుగా నిలబడ్డ క్రాక్.. వీకెండ్లో వాటి మీద ఆధిపత్యం చలాయిస్తోంది.
క్రాక్ సినిమా థియేటర్ల దగ్గర సందడి చూసి పరిశ్రమకే ఊపొస్తోంది. వీకెండ్లో మెజారిటీ షోలు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఒకప్పుడు థియేటర్లలో సీట్లన్నీ నిండిపోతే.. ఎక్స్ట్రా కుర్చీలు తీసుకొచ్చి వేసే కల్చర్ ఉండేది. క్రాక్ సినిమాకు పలు చోట్ల ఈ పరిస్థితి కనిపిస్తుండటం విశేషం. కరోనా ప్రభావం కారణంగా ఒక సీట్ తర్వాత ఇంకో సీట్ ఖాళీ వదలక తప్పట్లేదు.
వాటిని ఫిల్ చేయలేని పరిస్థితుల్లో థియేటర్ల యాజమాన్యాలు అదనంగా టికెట్లు అమ్మి వాటి కోసం కుర్చీలు వేస్తున్నారు. మాస్ రాజా అభిమానులు ఈ దృశ్యాలను షేర్ చేస్తూ తమ హీరో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చూపిస్తూ మురిపిసోతున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయిందని.. వీకెండ్ అయ్యేసరికి బయ్యర్లు లాభాల బాట పట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు.