అక్కినేని నాగార్జున.. ఆయన కుమారుడు నాగచైతన్యతో పాటు.. మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రేగిన రచ్చ తెలిసిందే. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు కొండా సురేఖ. బుధవారం ఉదయం గాంధీ జయంతి సందర్భంగా బాపూ ఘాట్ వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంలో మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు సమంత – నాగచైతన్యల విడాకులకు కారణం మాజీ మంత్రి కేటీఆర్ గా పేర్కొన్నారు.
అంతేకాదు.. చాలామంది హీరోయిన్లు తమ కెరీర్ ను వదిలేసి.. త్వరగా పెళ్లి చేసుకోవటానికి కూడా కేటీఆర్ తీరే కారణమన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో పెను దుమారం రేగింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేస్తే.. అక్కినేని నాగార్జున.. నాగ చైతన్య.. ప్రకాశ్ రాజ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్.. నానితో పాటు సమంత కూడా తప్పు పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై పలువురు తప్పు పట్టారు. మొత్తంగా మొన్నటి వరకు సోషల్ మీడియాలో కొండా సురేఖ మీద పెట్టిన అనుచిత పోస్టు వేళ.. ఆమెపై ఉన్న సానుభూతి కాస్తా ఆవిరి కావటంతో పాటు.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఒకరి తర్వాత ఒకరు తెర మీదకు రావటం.. మంత్రి చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని.. భేషరతు క్షమాపణలు చెప్పాలని కోరటం తెలిసిందే.
కొందరు మరో అడుగు ముందుకు వేసి.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. ఈ అంశంపై స్పందించాలని.. తమ పార్టీ నేతను అదుపులోకి పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆమె చేత తమ కుటుంబానికి క్షమాపణలు చెప్పించాలని రాహుల్ ను అక్కినేని ఫ్యామిలీ కోరటం తెలిసిందే.
ఇలాంటి వేళ.. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి కొండా సురేఖ. తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించటమే తప్పించి సమంత మనోభావాల్ని దెబ్బ తీయటం కాదన్నారు.
‘స్వయంశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు. ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా. అన్యదా భావించొద్దు’ అంటూ తాను తెచ్చిన వివాదానికి తానే పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.