తెలంగాణలో మునుగోడు బై ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ మూడో తేదీన పోలింగ్ జరగబోతుండడంతో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీa అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు మాటలతూటాలు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విమర్శలతో విరుచుకుపడ్డారు.
రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను బిజెపి అప్పగించిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు గుప్పించారు. కాంట్రాక్టుల కోసమే కోవర్ట్ బ్రదర్స్ ఆటలాడుతున్నారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఒక కాంట్రాక్టర్ అహం వల్లే మునుగోడుకు ఉప ఎన్నిక జరుగుతోందని భయపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అడ్రస్ లేని లవంగం గాళ్లంతా ఇప్పుడు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఓ రకంగా చంద్రబాబు వైయస్సార్ బెటర్ అని, ఇప్పుడు ఈ బఫూన్ గాళ్ళతో మాట్లాడాల్సి వస్తుందని, పిచ్చోళ్లతో పోరాడాల్సి వస్తుందని చురకలంటించారు. గుజరాతీలు తెలంగాణలో రాజకీయం చేస్తున్నప్పుడు టిఆర్ఎస్…బీఆర్ఎస్ గా మారితే తప్పేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డ కేసీఆర్ దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించొద్దా అని ప్రశ్నించారు. ఇక పార్టీ జెండా, గుర్తు మారదని…ఎవరు తికమకపడాల్సిన పనిలేదని కేటీఆర్ భరోసానిచ్చారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ నీ భాష జాగ్రత్త…ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలని, లేదంటే కేటీఆర్ అవినీతి చిట్టా మొత్తం తన వద్ద ఉందని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ వెంటనే కోవర్ట్ బద్రర్స్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోటీ రాజగోపాల్‌రెడ్డితో అని, తననెందుకు లాగుతున్నారని ఫైర్ అయ్యారు.