వైసీపీని 2019 ఎన్నికల్లో గెలిపించడానికి ఉపయోగపడిన అనేక కారణాల్లో కోడికత్తి కేసు ఒకటి. 2018, విశాఖ పట్నం విమానాశ్రయంలో దళిత యువకుడు శ్రీనివాసరావు.. అప్పటి విపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం జగన్పై కోడికత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన గత ఆరేళ్లుగా సాగుతూనే ఉంది. ఇప్పటికీ శ్రీనివాసరావు.. జైల్లోనే ఉన్నాడు. అయితే.. ఈ కేసును మరింత పొడిగించి.. వచ్చే ఎన్నికల వరకు సాగతీయాలనే ప్రయాత్నాలు జరుగుతున్నాయనేది దళిత సంఘాల ఆందోళన.
ఈ క్రమంలోనే ఈ కేసులో మరోసారి పూర్తిస్థాయి విచారణ చేయాలంటూ.. సీఎం జగన్.. కోర్టును కోరారు. దీనిపై ఎన్ ఐఏ విరుద్ధంగా వాదనలు వినిపించింది. ఈ కేసులో ఎలాంటి రాజకీయ కుట్ర కానీ, నేతల ప్రమేయం కానీ.. లేదని.. ఇది కేవలం శ్రీనివాసరావు సానుభూతితో చేసిన దాడేనని తేల్చింది. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పేసింది. ఇక, వాదనలు వినిపించేందుకు సీఎం జగన్ వైపు నుంచి ఏమీ లేదని కూడా తేల్చి చెప్పింది.
ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ పేర్కొంది. మరింత లోతైన దర్యాప్తు అవసరం లేదని కౌంటర్లో ఎన్ఐఏ మరోసారి పేర్కొంది. కౌంటర్లో నిందితుడు ఎయిర్ పోర్టులో వ్యవహరించిన తీరుపై ఎన్ఐఏ సమగ్రంగా వివరించింది. దాడికి ముందు కోడి కత్తి శ్రీను జగన్ వద్దకు వచ్చి 160 సీట్లు వస్తాయని చెప్పిన తర్వాతే దాడికి పాల్పడ్డాడని ఎన్ఐఏ పేర్కొంది. ఈ కేసుపై సాధారణ విచారణ కొనసాగుతుందని లోతైన విచారణ ను ఇప్పటికే పూర్తయినందున మరోసారి విచారణ అవసరం లేదని ఎన్ఐఏ తెలిపింది.
ఇది.. వైసీపీకి భారీ షాకే. ఇదేసమయంలో దళిత సంఘాల నుంచి కూడా వైసీపీపై ఒత్తిడి పెరుగుతోంది. దళితుడైన శ్రీనివాసరావుకు బెయిల్ రాకుండా.. సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని.. దళితులకు ఇదేనా మేలు చేసేది? అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో.. వైసీపీ ఆత్మరక్షణలో పడింది. కోడికత్తి కేసులో ఏదో ఒకటి తేల్చేయాలని.. ఇక సాగదీత ధోరణికి స్వస్తి చెప్పాలని తాజాగా వైసీపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్టు సమాచారం.