వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, టీడీపీ నాయకుడు బూతుల నానీగా పిలుచుకునే కొడాలి నాని చాలా రోజుల తర్వాత.. మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్‌తో కలిసి విజయవాడకు వచ్చిన కొడాలి.. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని భేటీ కావాలని భావించారు. అయితే.. భద్రతా పరమైన నిబంధనల్లో భాగంగా.. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని వంటివారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు.
ఈ నేపథ్యంలో బయటే ఉన్న కొడాలి నాని.. మీడియాతో మాట్లాడారు. మీడియా ముందుకు ఎందుకు రావట్లేదన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తాము ఇప్పుడు ఓడిపోయి ఉన్నామని.. కాబట్టి తాము ఇప్పుడు ఏం చేసినా.. ఏం చెప్పినా.. ప్రయోజనం లేదని అందుకే మౌనంగా ఉన్నట్టు కొడాలి తెలిపారు. ఇక, తనపై నమోదైన కేసులను తాను లైట్ తీసుకుంటానని చెప్పారు. “నాపై మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి..“ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఎన్ని కేసులు పెట్టుకున్నా బయటకు వచ్చేందుకు.. తెచ్చేందుకు తమ లాయర్లు కూడా రెడీగానే ఉన్నారని రవి పేర్కొన్నారు. ఇక, రెడ్ బుక్.. గురించి ప్రస్తావిస్తూ.. నారా లోకేష్ రెడ్ బుక్.. రెడ్ బుక్ అంటున్నాడని.. కానీ, తాను చూడలేదన్నారు. “లోకేష్ రెడ్ బుక్‌ని నేను చూడలేదు. దానిలో నా పేరు ఉందో లేదో తెలీదు. ఎమ్మెల్యే ఉద్యోగం పీకేశాక ఇంకేం మాట్లాడతామని ఎదురు ప్రశ్నించారు. పైగా.. తమపై కేసులు పెట్టడం ఖాయమని తమకు తెలుసన్నారు.
చిన్న చిన్న కేసుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న కొడాలి.. ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు సహజంగా ఎదురయ్యే అనుభవాలేనని చెప్పారు. “రెడ్ బుక్ లేదు, బ్లూ బుక్ లేదు.. ఏ బుక్‌ను పట్టించుకునేది లేదన్నారు. అయితే.. తమకు కూడా ఒకరోజు వస్తుందని పరోక్షంగా టీడీపీనాయకులను కొడాలి హెచ్చరించడం గమనార్హం.