వల్లభనేని వంశీ చేసిన పొరపాట్లు తాను చేయకూడదని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని భావిస్తున్నారా..? మెరుగైన వైద్యం పేరుతో అమెరికా చెక్కేస్తున్నారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలపై అసభ్యకరమైన పదజాలంతో కొడాలి ఏ రేంజ్ లో రెచ్చిపోయారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే తెర వెనుక మట్టి, ఇసుక సహ అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అందుకు సంబంధించిన కేసులు కూడా సిద్ధంగా ఉన్నాయి.
అరెస్టుకు రంగం సిద్ధమవుతున్న సమయంలో కొడాలి నాని గుండె నొప్పి అంటూ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో కొడాలి నానికి గుండె సంబంధిత సర్జరీ జరిగింది. సర్జరీ నుంచి కోరుకుంటున్న కొడాలి ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే వల్లభనేని వంశీ జైలు నుంచి రిలీజ్ అయ్యే సమయానికి కొడాలి నాని అరెస్టు అవ్వడం ఖాయం అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో అప్రమత్తమైన కొడాలి అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా లీకులు వస్తున్నాయి.
మెరుగైన చికిత్స నిమిత్తం మెడికల్ వీసాపై అమెరికా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట. పైగా అత్యంత సన్నిహితులు మినహా మిగతా వారెవ్వర్నీ కలిసేందుకు కొడాలి నాని ఇష్టపడటం లేదని అంటున్నారు. కాగా, గతంలో కేసుల భయంతో వల్లభనేని వంశీ సైతం అమెరికాకి జంప్ అవ్వాలని భావించారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసి హైదరాబాద్‌లోనే కూర్చున్నారు. చివరకు అరెస్ట్ అయ్యి విజయవాడలో దాదాపు మూడు నెలల నుంచి ఊసలు లెక్కబెడుతున్నారు. ఈ పరిస్థితి తనకెక్కడ వస్తుందో అని ముందే జాగ్రత్త పడుతున్నారు కొడాలి నాని.