వైసీపీ హయాంలో అధికారపు అహంకారంతో ఆ పార్టీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని తదితరులు టీడీపీ నేతలపై అసభ్య పదజాలంతో దుర్భాషలకు దిగిన సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. ఈ అరెస్టులు ఇక్కడితో ఆగవని మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. బియ్యం అక్రమ రవాణా కేసులో పేర్ని నాని అరెస్ట్ ఆలస్యమైందని కొల్లు రవీంద్ర అన్నారు. అంతేకాదు, త్వరలోనే పేర్ని నాని అరెస్ట్ ఖాయమని రవీంద్ర చెప్పారు.
ఇక, ఎన్నికల తర్వాత కొడాలి నాని అడ్రస్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో కొడాలి నాని చేసిన అరాచకాలకు, అకృత్యాలకు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాదు, వైసీపీ హయాంలో అరాచకం చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలుంటాయని రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని, వంశీ వంటి నేతలను ఏమీ చేయలేదన్న ఆవేదన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల్లో ఉందని… వల్లభనేని వంశీ అరెస్ట్ తో కూటమి శ్రేణుల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు. కర్మఫలం ఎవరినీ వదలదని , రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్ట్ లు ఉంటాయని జోస్యం చెప్పారు.