ఎవరేం అనుకుంటారన్న ఆలోచన మాత్రమే కాదు.. నోటికి ఎంత పడితే అంత మాట అనేస్తూ.. తనకు మించినోళ్లు లేరన్నట్లుగా వ్యవహరించే వైసీపీ నేతల్లో.. మాజీ ఎమ్మెల్యే కం మంత్రి కొడాలి నాని ఒకరు. వైసీపీ ప్రభుత్వంలో తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడారో.. ఎంతటి అహంకారాన్ని ప్రదర్శించారో అందరికి తెలిసిందే. ఎన్నికల వేళ ఆయన ప్రదర్శించిన గెలుపు ధీమాను చూసినోళ్లు ముక్కున వేలేసుకునే పరిస్థితి.
ఎట్టకేలకు ఎన్నికల్లో ఆయన ఓటమిపాలైన తర్వాత కాస్త నిదానించారు.అప్పటివరకు చానల్ మైకు కనిపిస్తే చాలు.. చెలరేగిపోయే ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించటం షురూ చేశారు. మీడియాతో మాట్లాడటం మానేయటంతో పాటు.. బయటకు రావటం తగ్గించారు. ఇలాంటి వేళలోనే ఆయనపై కేసులు నమోదయ్యాయి.
అప్పటివరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని ఆయనకు.. గుండె సమస్యతో బాధ పడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లిన కొడాలి నాని.. ఇప్పుడు మరింత మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీకీ చెందిన నేతల్లో అత్యధికుల్ని అస్సలు కలిసేందుకు ఇష్టపడటం లేదని.. అత్యంత సన్నిహితులను తప్పించి మిగిలిన వారిని దగ్గరకు రానివ్వటం లేదని చరెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఇసుక సమా అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొడాలి మెడకు ఉచ్చు ఏ క్షణంలో అయినా చుట్టుకునే వీలుందని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఆయన.. అమెరికాకు వెళ్లే ఆలోచనలో ఉన్నారంటున్నారు. మరి.. కేసుల లెక్క ఒక కొలిక్కి రాక ముందే అమెరికాకు వెళ్లిపోతారా? అందుకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా? కోర్టులు.. అధికారులు అనుమతులు ఇస్తారా? అన్నది ప్రశ్నలుగా మారాయి.