తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కాక రేపుతున్న సంగతి తెలిసిందే. ఇక, తన ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేసిందని, అయితే నీతిమంతులైన తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా బీజేపీ గుట్టురట్టు చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన తతంగం వీడియోను మీడియాకు కేసీఆర్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ చూపించిన వీడియోలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలన్న మాట ఎక్కడా లేదని కిషన్ రెడ్డి అన్నారు. అయినా, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరో కూల్చేస్తే కూలిపోయేంత బలహీనంగా ఉందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇంకా, చెప్పాలంటే స్వామీజీలకు ప్రభుత్వాలను కూల్చేంత సీన్ ఉంటుందా అంటూ కేసీఆర్ ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అయినా, ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారు అంటూ కేసీఆర్ ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదని ఆయన చురకలంటించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్ద నీతిమంతుడు అన్నట్టుగా కేసీఆర్ చెబుతున్నారని విమర్శించారు. తన ఆక్రోశాన్ని, అభద్రతాభావాన్ని కేసీఆర్ మరోసారి బట్టబయలు చేసుకున్నారని, తన సీఎం పదవిని చులకన చేసేలా తానే మాట్లాడారని చెప్పారు. బ్రోకర్ల ద్వారా ఇతర పార్టీల నేతలను కొనే అవకాశం టిఆర్ఎస్ కు ఉందేమోనని, బిజెపికి లేదని అన్నారు.
తన తర్వాత కేటీఆర్ సీఎం కాలేడేమో అన్న భయంతోనే ఈ తరహా చిల్లర రాజకీయాలకు కేసీఆర్ తెర తీశారని మండిపడ్డార., ఈ తరహా జిమ్మిక్కులను కేసీఆర్ మానుకోవాలని, గతంలో ప్రత్యేక హోదా పేరుతో బిజెపిపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేశారని…ఇప్పుడు కేసీఆర్ కూడా అదే తరహాలో బిజెపిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.