పైకి తిట్టినా కూడా వైసీపీ,బీజేపీ ఒక్కటే..అన్నది పసుపు పార్టీ అనుమానం కావొచ్చు. పైకి తిట్టినా కూడా టీడీపీ,బీజేపీ ఒక్కటే అన్న అభిప్రాయం వైసీపీది కావొచ్చు.పైకి తిట్టినా కూడా కేసీఆర్,కిషన్ రెడ్డి ఒక్కటే అన్నది కాంగ్రెస్ చెప్పే వాదం కావొచ్చు. అయినా రాజకీయం ఏ విధంగా అయినా ఏ నిమిషంలో అయినా మార్పు చెందవచ్చు. ఆ మార్పునకు అనుగుణంగా పార్టీలు తమ దిశనూ, దశనూ మార్చుకుంటూ వెళ్లడమే ఇవాళ్టి అవసరం.
నిన్నటి దాకా జగన్ కు దగ్గరగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఆయనను నియంత అని అంటున్నారే ? అంటే నియంతల పాలన ఎక్కువ కాలం ఉండదు అని ఆయన ఎవరిని ఉద్దేశించి చెబుతున్నారని..? మరి! ప్రజా స్వామ్యంలో నియంతృత్వం చెల్లదు అని ఎవరి ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు ఇవాళ కిషన్ రెడ్డి చేసి ఉంటారని ! ప్రయోజనం పరమావధిగా రాజకీయం ఉంటే అప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా పరిణామాలు అన్నీ క్షణానికో మారు మారిపోవడం తథ్యం అని నిర్థారించుకోవడం సగటు ఆంధ్రావాలా బాధ్యత కావాలి..అంతే అంటారా కిషన్ !
ఆంధ్రావని అప్పులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన చెందారు.రానున్న కాలంలో ఏపీలో వైసీపీ కి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ మాత్రమే కాబోతుందని జోస్యం చెప్పారు.ఇవాళ విలేకరులతో మాట్లాడిన కిషన్ రెడ్డి ఎన్నడూ లేనంతగా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
అంతేకాదు కడప కేంద్రంగా నిర్వహించిన రాయల సీమ రణ భేరీ తరువాత సీన్ మొత్తం మారిపోనుందని ఆత్మవిశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇవి విని వైసీపీ నాయకులు భిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏపీలో జగన్ నిలదొక్కుకోవడం గ్యారంటీ అని అంటున్నారు.
ఇక ఏపీలో జగన్ మోడల్ మరోసారి వర్కౌట్ కానుందని కూడా అంటున్నాయి వైసీపీ వర్గాలు.అప్పులు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ పట్టించుకునే స్థితిలో కేంద్రం ఉన్నా రాష్ట్రంలో మాత్రం సంక్షేమ జపం మాత్రం బాగానే వర్కౌట్ కానుందని కూడా చెబుతున్నాయి.మూడు దశల్లో కోవిడ్ యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేశాక తామేం చేయగలమని అంటున్నారు.
ఈ దశలో కిషన్ రెడ్డి కలలు చెల్లవనే అంటున్నారు క్షేత్ర స్థాయిలో ఉన్న వైసీపీ నాయకులు.కానీ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొట్టిపారేయడం అంత సులువు కాదని జనసేన అంటోంది.
ఎందుకంటే గతంలో బీజేపీతో ఎంతో సన్నిహితంగా ఉన్న వైసీపీ ఇవాళ తన దారి మార్చి కొత్త దారిలో వెళ్తోందని, ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుకోవాలని చూడడం తప్పేం కాదని, అలా అని విపక్ష బలాలను తక్కువ చేయడమే ఇప్పుడున్న ప్రధాన సమస్యకు కారణం అని టీడీపీ అంటోంది.మరి! కిషన్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ చెడింది అన్నదే పెద్ద అనుమానంగా ఉందని కూడా అంటోంది టీడీపీ.కేంద్రంతో సఖ్యంగా ఉండే వైసీపీ,రాష్ట్రం వరకూ వచ్చాకే బీజేపీతో కయ్యాలు ఆడిన విధంగా పైకి కనిపిస్తున్నా అవేవీ నమ్మడానికి వీల్లేదని పదే పదే మీడియాలో ఓ వర్గం అంటోంది.అంటే టీడీపీ కి కూడా బీజేపీ వైసీపీ బంధాలపై అనుమానాలు ఉన్నాయా?