ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంలో తన కెరీర్లోనే అతి పెద్ద సినిమాను లైన్లో పెట్టాడు విశ్వక్. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో అతను ఓ భారీ చిత్రం చేయబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా అర్జున్ తనయురాలు ఐశ్వర్య అర్జున్ నటించనుంది. ఈ చిత్రానికి ఒక హ్యాపెనింగ్ టెక్నీషియన్‌ను తీసుకున్నారు. అతను ఎవరో కాదు.. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్. ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఈ టెక్నీషియన్ పేరు మార్మోగిపోయింది.
ఆ చిత్రానికి రవి నేపథ్య సంగీతం ఎంత బలంగా నిలిచిందో.. సోషల్ మీడియాలో అతడి ట్రాక్స్ ఎంత పాపులర్ అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎలివేషన్ సీన్లకు, యాక్షన్ ఘట్టాలకు ఆర్ఆర్ ఇవ్వాలంటే ప్రస్తుతం రవిని మించినోడు లేడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాంటి సంగీత దర్శకుడిని విశ్వక్ సినిమాకు పెట్టుకోవడాన్ని బట్టి ఇది పెద్ద రేంజిలో చేయబోయే సినిమా అని అర్థమవుతుంది.
హీరోగా తాను చేసిన సినిమాలతో యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్.. దర్శకుడిగానూ ఆ జానర్లోనే సినిమాలు చేశాడు. ‘జైహింద్’ సహా చాలా వరకు యాక్షన్ సినిమాలే తీశాడు. తానే హీరోగా నటిస్తూ దర్శకుడిగా వరుసగా కొన్ని పరాజయాలు ఎదురవడంతో గ్యాప్ తీసుకున్న అర్జున్.. ఇప్పుడు విశ్వక్ లాంటి యంగ్ హీరోను పెట్టి సినిమా తీయడానికి రెడీ అవడం ఆసక్తి రేకెత్తించేదే. మరి వీరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుందో.. అది ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్మిస్తోంది.