కన్నడ రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబోలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ సినిమా…అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం…దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా పలు రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా కన్నడ బాహుబలిగా నిలిచి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. రాఖీ భాయ్ గా యశ్ నటనకు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే భారీ అంచనాలతో విడుదలైన ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలకు మించి భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా సంచలనాలకు తెరతీసింది. తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 134.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో అయితే, బాహుబలి-2 రికార్డును రాఖీ భాయ్ బద్దలు కొట్టారు. తొలి రోజున హిందీ వెర్షన్ 53.95 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.
ఒక్క కేరళలోనే ఈ సినిమా తొలి రోజున 7.30 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా తొలి రోజున 9 కోట్లకి పైగా షేర్ ను సాధించింది. రెండవ రోజున 7.3 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండు రోజుల వసూళ్లను కలుపుకుని చూస్తే, దేశవ్యాప్తంగా ఈ సినిమా 238.5 కోట్ల గ్రాస్ ను, ప్రపంచవ్యాప్తంగా 278.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, రాఖీ భాయ్ సీన్లలో భారీ ఎలివేషన్లు, మదర్ సెంటిమెంట్ వంటి అంశాలు ఈ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లాయి.
వసూళ్లలో ఇదే ఊపు కొనసాగితే ఈ వీకెండ్ పూర్తయ్యే నాటికి ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక, ఈ మధ్యకాలంలో మరే పెద్ద సినిమా లేకపోవడంతో ఈ చిత్రం మే1 నాటికి వెయ్యి కోట్లు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.