‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమా మీద అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తన తర్వాతి చిత్రం చేయాల్సింది. కానీ అది కొంచెం వెనక్కి వెళ్లింది. అట్లీ సినిమా ముందుకు వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. త్రివిక్రమ్ సినిమా ఎందుకు ఆలస్యం అయిందన్న దానిపై స్పష్టత లేదు.
కొందరేమో ఈ చిత్రం ఆగిపోయిందని కూడా ప్రచారం చేశారు. కానీ అది నిజం కాదు. స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులకు అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పట్టేలా ఉండడంతో బన్నీ మధ్యలో వేరే సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇప్పటిదాకా మామూలు ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్లే తీసిన త్రివిక్రమ్.. ఈ సారి పాన్ ఇండియా లెవెల్లో ఒక ఈవెంట్ ఫిలిం చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే ఈ ఆలస్యం.
ఈ మూవీ స్పాన్ గురించి ఇటు సూర్యదేవర నాగవంశీ, అటు బన్నీ వాసు ముందు నుంచి చాలా గొప్పగా చెబుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ త్రివిక్రమ్-బన్నీ మూవీ కథాంశం గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. తెలుగులో ఒకప్పటిలా పురాణ గాథలు రాకపోవడం గురించి ప్రశ్నిస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేయబోయేది మైథాలజీనే అని వెల్లడించాడు వంశీ. ఐతే అది పురాణ గాథే కానీ.. అందరికీ తెలిసిన కథ మాత్రం కాదని చెప్పాడు.
ఆ పురాణ పురుషుడి పేరు జనాలకు తెలుసని.. కానీ అతడి కథలో ఏం జరిగిందన్నది తెలియదని వంశీ చెప్పాడు. ఆ సినిమా ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ చేసేలా ఉంటుందంటూ ఎలివేషన్ ఇచ్చాడు నాగవంశీ. ఎవ్వరూ ఊహించనంత పెద్ద స్పాన్లో ఈ మూవీ ఉంటుందని.. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందని నాగవంశీ వెల్లడించాడు. మరి త్రివిక్రమ్ ఎవరి కథను చెప్పబోతున్నాడు.. పేరు మాత్రమే తెలిసి, తన కథ తెలియని పురాణ పురుషుడు ఎవరన్న దానిపై అమితాసక్తి నెలకొంది.