భారత్ పై ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన పాక్ కు తగిన బుద్ధి చెప్పేందుకు వీలుగా ఆ దేశంలోని పలు వైమానిక స్థావరాలపై భారత వైమానిక దళం క్షిపణి దాడులు చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ చేసిన దాడిలో పాక్ కు చెందిన అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీకేజ్ అయినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు రావటం తెలిసిందే.
ఈ వాదనకు బలం చేకూరేలా బోలెడన్ని ఉదంతాల్ని చూపిస్తున్న పరిస్థితి. అయితే.. అధికారికంగా మాత్రం అలాంటిదేమీ లేదని పాక్ చెబుతున్నా.. అంతర్జాతీయ మీడియా.. సోషల్ మీడియా కథనాలు మాత్రం అందుకు భిన్నమైన వాదనల్ని వినిపిస్తూ కథనాలు వెలువరించాయి.
ఇదిలా ఉండగా పాక్ అణు కేంద్రాల స్థావరమైన కిరానా హిల్స్ గురించి అసలు తమకు తెలీదని.. ఇప్పటివరకు తమకు తెలియని సమాచారాన్ని తెలిసేలా చేసిన పాక్ కు ఎయిర్ మార్షల్ ఏకే భారతి థ్యాంక్స్ చెప్పటం తెలిసిందే.
అణుకేంద్రాలపై తాము దాడి చేయలేదని భారత్ స్పష్టం చేయటం.. అలాంటి పరిస్థితి ఏమీ లేదని భారత వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ సైతం ఇలాంటి వాదనను వినిపిస్తోంది. ఇందుకు భిన్నంగా అంతర్జాతీయ మీడియా మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి వేళ రంగంలోకి దిగింది అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ అణుకేంద్రాలపై భారత్ దాడి చేసిందన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
తమకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అణు లీకేజీ అన్నదే లేదని స్పష్టం చేసింది. అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీకేజీపై కీలక అంతర్జాతీయ సంస్థ స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ తరహా వాదనలకు చెక్ చెప్పొచ్చని చెప్పాలి.