వెంకీ కుడుముల డైరెక్షన్ లో యూత్ స్టార్ నితిన్, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన చిత్రం `రాబిన్ హుడ్`. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, దేవదత్త నాగే ముఖ్యమైన పాత్రలను పోషించగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో, కేతిక శర్మ స్పెషల్ సాంగ్ లో మెరిశారు. మంచి అంచనాలు నడుమ నేడు విడుదలైన రాబిన్ హుడ్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకోండి. నితిన్ హుషారైన యాక్టింగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, కామెడీ సినిమాకు హైలైట్ గా నిలిచాయని అంటున్నారు.
అయితే కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం మైనస్ గా చెబుతున్నారు. మొత్తంగా రాబిన్ హుడ్ డీసెంట్ ఎంటర్టైనర్ అనిపించుకుంటుంది. ఈ సంగతి పక్కన పెడితే.. రాబిన్ హుడ్ లో `అదిదా సర్ప్రైజు` అంటూ స్పెషల్ సాంగ్ లో కేతిక శర్మ వేసిన హుక్ స్టెప్స్ కాంట్రవర్సీకి తెర లేపిన సంగతి తెలిసిందే. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఆ స్టెప్స్ చాలా అసభ్యంగా, స్త్రీలను అవమానించేలా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చిత్ర యూనిత్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు.
నితిన్, శ్రీలీలతో పాటు డైరెక్టర్ వెంకీ కుడుముల సైతం ఆ హుక్ స్టెప్స్ బూతుగా ఏమీ లేదన్నట్లే మాట్లాడారు. ఇదే తరుణంలో కొందరు నెటిజన్స్ `అదిదా సర్ప్రైజు` సాంగ్ ను ఎంజాయ్ చేస్తూ మల్లెపూల కాస్ట్యూమ్ తో రీల్స్ కూడా చేశారు. మొత్తంగా కేతిక శర్మ వేసిన హుక్ స్టెప్స్ పై వచ్చిన నెగటివిటీ సినిమా పబ్లిసిటీకి బాగా ఉపయోగపడింది. అయితే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశంపై సీరియస్ గా రియాక్ట్ అయింది.
సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమమని.. అటువంటి సినిమాలో స్త్రీలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయంటూ మహిళా కమిషన్ మండిపడింది. మహిళలను తక్కువ చేసి చూపించే సన్నివేశాలు, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలని దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు, సంబంధిత వర్గాలను హెచ్చరించింది. ఈ మేరకు బహిరంగ లేఖను రాసింది.
ఈ నేపథ్యంలోనే ఆలోచనలో పడిన రాబిన్ హుడ్ చిత్రబృందం.. ఇండియన్ థియేటర్స్‌లో `అదిదా సర్ప్రైజు` హుక్ స్టెప్స్ ను తొలగించింది. ఈ విషయంపై మూవీ యూనిల్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. థియేటర్స్ లో మాత్రం స్టెప్స్ కనిపించకుండా మ్యానేజ్ చేసి ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. అయితే ఓవర్సీస్లోని థియేటర్స్‌లో మాత్రం హుక్ స్టెప్స్ ను అలానే ఉంచారు.