ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో వేల కోట్ల రూపాయల చేతులు మారాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ లిక్కర్ స్కాం కింగ్ పిన్ అయిన కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ అధికారుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో అసలు పాత్రధారి పేరు చెబితే తనను లేపేస్తారని, ఆ పేరు చెప్పిన రోజే తనకు చివరి రోజు అని షాకింగ్ కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు పేరు చెబితే తనకు అంతిమ ఘడియలు వచ్చినట్లేనని కెసిరెడ్డి అన్నారట. అధికారులు ఏం చేసినా అంతకంటే ఏమీ చెప్పలేనంటూ కెసిరెడ్డి తలదించుకున్నారట. ఈ కుంభకోణంలో కీలక నిందితులు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ మాజీ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ప్రశ్నించడానికి సిట్ అధికారులు రెండు రోజుల కస్టడీ కోరిన సంగతి తెలిసిందే. వారిని అడిగేందుకు 100 ప్రశ్నలను సిట్ అధికారులు రెడీ చేసుకున్నారు. 2 రోజులపాటు ప్రశ్నించినా వారు..గుర్తు లేదు..తెలీదు..అని సమాధానాలిచ్చారని తెలుస్తోంది.