టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. నాని సోదరుడు కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని, రాబోయే ఎన్నికలలో తన అన్న స్థానంలో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు, నానికి మధ్య గ్యాప్ వచ్చిందని పుకార్లు వినిపించాయి.
ఈ నేపథ్యంలోనే గతంలో టీడీపీపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రక్షాళన జరగాల్సిందేనని, ప్రజాస్వామ్యంలో 420, కాల్ మనీ వ్యాపారస్తులు కూడా భాగస్వాములయ్యారని షాకింగ్ కామెంట్లు చేశారు. చీటర్లకు, రియల్ ఎస్టేట్ మోసగాళ్లకు, కబ్జాకోరులకు టిడిపి టికెట్లు ఇవ్వకూడదు అంటూ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. టిడిపిలో ముగ్గురు నేతలున్నారని, వారికి టికెట్లు ఇస్తే తాను కచ్చితంగా పనిచేయనని కేశినేని తేల్చి చెప్పేశారు. తన తమ్ముడికి సీటు ఇస్తే చచ్చినా మద్దతు ఇవ్వబోనని కేశినేని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్యేపై కేశినేని నాని ప్రశంసలు కురిపించడం షాకింగ్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ ను కేశినేని పొగడ్తలతో ముంచెత్తడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్యేను టీడీపీ ఎంపీ పొగడడం ఏమిటి అని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై నాని స్పందించారు. మంచిపని చేసే వాళ్ళను తాను అభినందిస్తానని, జగన్మోహన్ తనకు నాలుగేళ్లుగా తెలుసని అన్నారు.
మైనింగ్, ఇసుకలో వాటాలు ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాలు చేసే వ్యక్తిని తాను కాదని కేశినేని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎవరు మంచి చేసినా ప్రశంసిస్తానని అన్నారు. బెజవాడ అభివృద్ధి కోసం ముళ్లపందితోనైనా కలుస్తానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనకు టిడిపి టికెట్ ఇవ్వకపోతే కేశినేని భవన్ లో కూర్చుని ప్రజా సేవ చేస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు.