విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన రాజకీయ సన్యాసానికి విరామం పలకబోతున్నారా? మళ్లీ పాలిటిక్స్ లోకి యూటర్న్ కాబోతున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ నుంచి రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన కేశినేని నాని.. 2024 ఎన్నికలకు ముందు జగన్ పంచన చేరారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అది కూడా సొంత తమ్ముడు కేశినేని చిన్ని చేతుల్లోనే. ఆ వెంటనే రాజకీయ సన్యాసాన్ని ప్రకటించి సైలెంట్ అయిన నాని.. గత కొద్ది రోజుల నుంచి చిన్ని లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేయడం షురూ చేశారు.
మొదట ఉర్సా వివాదంలో చిన్నిని టార్గెట్ చేశారు నాని. ఆ తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్ కేంద్రంగా అన్నదమ్ముల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన రాజ్ కసిరెడ్డితో చిన్నికి సంబంధాలు ఉన్నాయంటూ నాని వరుస ట్వీట్లు చేశారు. ముఖ్యమంత్రికి చంద్రబాబుకు లేఖలు రాశారు. చిన్ని కూడా అంతే ధీటుగా నానికి బదులిచ్చారు. ఆరోపణలు ప్రతిఆరోపణలతో బెజవాడ రాజకీయాలను అన్నదమ్ములిద్దరూ హీటెక్కించారు. రాజకీయ సన్యాసం ప్రకటించిన నాని.. మళ్లీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే కచ్చితంగా పొలిటికల్ రీఎంట్రీ కోసమే అన్న టాక్ బలంగా వినపడుతోంది.
వైసీపీని వీడాక బీజేపీలో చేరేందుకు నాని ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. బీజేపీ అధినాయకత్వంలోని ముఖ్యులతో సత్సంబంధాలు ఉండటంతో ఆ దిశగా ఆయన పావులు కదిసారు. కానీ బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉండటంతో.. నాని చేరికకు టీడీపీ అడ్డుకట్ట వేసింది. ఇందుకు కారణం లేకపోలేదు. టీడీపీ ఎంపీగా ఉంటూనే జగన్ తొత్తుగా పనిచేశారన అపవాదు నానిపై ఉంది. పైగా గతంలో టీడీపీ అధినాయ్కత్వాన్ని ధిక్కరించి నాని ఘాటు విమర్శలు చేశారు. అందువల్ల నానిని బీజేపీ తీసుకుంటే అందుకు టీడీపీ ఒప్పుకునే సీన్ లేదు.
అయితే కేశినేని నాని పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలే కానీ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ రెడీగా ఉంది. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేత ఒకరు నానితో చర్చలు జరిపారట. పార్టీలోకి కూడా ఆహ్వానించారు. కానీ నాని మాత్రం ఎటువంటి సమాధానం చెప్పలేదట. ఎందుకంటే, ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడే వైసీపీలో చేరితే రాజకీయంగా ఇబ్బందలు తప్పవు. అందుకే 2029 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారట. అప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బలం పెంచుకోవాలని నాని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.