విజయవాడలో వైసీపీ నేత కేశినేని వర్సెస్ టీడీపీ నేత కేశినేని చిన్ని మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కేశినేని నాని ఒంటెత్తు పోకడలు నచ్చక బెజవాడ ఎంపీ టికెట్ ను చిన్నికి ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపడంతో నాని వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న నానిని ఆయన సోదరుడు కేశినేని చిన్ని ఏకిపారేస్తున్నారు. కేశినేని నానికి విశ్వాసం లేదని, ఆయన వైసీపీలో చేరడంతో సైకోలంతా ఒకే చోటకు చేరినట్టయిందని ఎద్దేవా చేశారు.
బెజవాడ లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల్లో కేశినేని నాని పోటీ చేస్తే కచ్చితంగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడతారని జోస్యం చెప్పారు. విజయవాడ ఎంపీ టికెట్ పై నానికి వైసీపీ భరోసానివ్వలేదని అన్నారు. టీడీపీలో కేశినేని నానికి చాలా గౌరవం ఉండేదని, వైసీపీలో ఆయన స్థాయి దిగజారిందని చెప్పారు. దేవినేని అవినాశ్ కు నాని ముఖ్య అనుచరుడిగా మారారని ఎద్దేవా చేశారు. విజయవాడ ఎంపీగా తాను పోటీ చేసే విషయాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.
టీడీపీ అధినాయకత్వం సూచించిన చోటి నుంచే పోటీ చేస్తానని, టికెట్ల కేటాయింపులపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తనకు టికెట్ ఇస్తే కేశినేని నానికి టికెట్ వస్తే ఆయనపై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు.