సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ నుంచి ఒక తెలుగు సినిమా విడుదలై చాలా కాలమే అవుతుంది. చివరిగా 2023లో వచ్చిన `భోళా శంకర్`లో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఆమె మరో సినిమా చేయలేదు. అవకాశాలు రాకపోవడం వల్లో లేక కథలు నచ్చకపోవడం వల్లో తెలియదు కానీ టాలీవుడ్ తో కీర్తి సురేష్ కు కొంత గ్యాప్ వచ్చిందనే చెప్పవచ్చు. అయితే తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ లో మన కళావతి క్రేజీ ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్ స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట.
`రాజావారు రాణి వారు` ఫేం రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ `రౌడీ జనార్దన్` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్ర కోసం యాంగ్రీ ఎంగ్‌మెన్ రాజశేఖర్ ను సంప్రదించినట్లుగా ఈమధ్య వార్తలు వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే.. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న రౌడీ జనార్దన్‌లో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక అయిందట.
విజయ్, కీర్తి కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. పైగా ఈ సినిమాలో కీర్తి క్యారెక్టర్ బోల్డ్‌గా ఉండబోతుందట. హీరో విజయ్ దేవరకొండతో ఆమెకు లిప్-లాక్ సన్నివేశాలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా టాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్‌కు కీర్తి సురేష్ సైన్ చేసిందనే వార్తలు తెరపైకి రావడంతో ఇక్కడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటున్న రౌడీ జనార్దన్.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం `కింగ్‌డమ్` ప్రమోషన్స్ లో విజయ్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ విడుదలైన వెంటనే రౌడీ జనార్దన్ షూట్‌లో జాయిన్ కానున్నాడు.