మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఖండించినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇటీవల కూడా తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ను కీర్తి మ్యారేజ్ చేసుకోబోతోందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా వెళ్లి వార్తల పై కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రస్తుతం కీర్తి తన రాబోయే చిత్రం `రఘు తాత` ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. హోంబలే ఫిల్స్మ్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు. కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న రఘు తాత మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఈవెంట్ లో పాల్గొన్న కీర్తి సురేష్.. తన అభిమానులతో ముచ్చటించింది.
అయితే ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ పెళ్లి వార్తలపై ప్రశ్నించగా.. కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `రూమర్స్ పై ప్రతిసారి మనం క్లారిటీ ఇస్తుంటే అదే నిజమనుకుంటారు. అందుకే నేను పుకార్లపై రియాక్ట్ కాను. నా వరకు నా నటన లేదా సినిమాల ఎంపిక పై విమర్శలు చేస్తే వాటిని కచ్చితంగా స్వీకరిస్తాను. వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. కానీ నా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే అస్సలు పట్టించుకోను. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు` అంటూ కీర్తి సురేష్ పేర్కొంది. మొత్తానికి పెళ్లి వార్తలను పరోక్షంగా ఆమె కొట్టిపారేసింది.