మహానటి సినిమాతో జాతీయస్థాయిలో భారీ స్టార్డమ్ సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఓ ఇంటిది అయిపోయింది. తన చిరకాల మిత్రుడు, ప్రియుడు ఆంటోనీ తట్టిల్ తో కీర్తి సురేష్ మూడు ముళ్ళు వేయించుకుంది.
దాదాపు 15 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. తమ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలనే ఉద్దేశంతో గురువారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. గోవాలో ఎంతో వైభవంగా వీరి వివాహం జరిగింది.
పెళ్లికి సంబంధించిన ఫోటోలను ForTheLoveOfNyke అనే హ్యాష్‌ట్యాగ్ తో కీర్తి సురేష్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకుంది. ఆంటోనీ తన మెడలో తాళి కడుతున్న ఫోటో, ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫొటో, ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలను కీర్తి పంచుకుంది. పెళ్లి దుస్తుల్లో అందంగా మెరిసిపోతున్న వధూవరులకు అభిమానులు, నెటిజన్లు మరియు సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు.
కాగా, కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. త్వరలోనే బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది. ఆంటోనీ విషయానికి వస్తే.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అతను ఖతార్ లో కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. ఆపై స్వదేశానికి వచ్చి కొచ్చిలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు.
ఇక హైస్కూల్ లో చదువుకుంటున్నప్పటి నుంచే కీర్తి సురేష్, ఆంటోనీ ప్రేమాయణం నడుపుతున్నారు. ఆ ప్రేమనే ఇప్పుడు ఇరువురి పెళ్లికి దారితీసింది. కీర్తి-ఆంటోనీల వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. మరి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.