ఇపుడీ వార్తే విచిత్రంగా ఉంది. రెండుచోట్ల పోటీచేసిన కేసీఆర్ ఒక నియోజకవర్గంలో ఓడిపోబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. కేసీయార్ గజ్వేలు నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలో కూడా పోటీచేసిన విషయం తెలిసిందే. గజ్వేలులో అతికష్టం మీద బయటపడినా కామారెడ్డిలో మాత్రం ఓటమి తప్పదనే జోస్యాలు పెరిగిపోతున్నాయి. మామూలుగానే కామారెడ్డిలో కేసీయార్ గెలుపు కష్టమనే ప్రచారం మొదటినుండి ఉంది. దానికి తగ్గట్లే ఇపుడు ఎగ్జిట్ పోల్స్ సర్వే కూడా అదే విషయాన్ని చెప్పటంతో కేసీయార్ ఓటమి ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది.
ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు వెల్లడించిన సంస్ధలు ఆరా అనే సంస్ధ కూడా ఉంది. ఈ సంస్ధ ప్రకారం గజ్వేలులో కేసీయార్ అతికష్టం మీద గెలుస్తున్నారు. అయితే కామారెడ్డిలో మాత్రం ఓడిపోతారని బల్లగుద్ది మరీ చెబుతోంది. కేసీయార్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటమి తప్పదని ఈ సంస్ధ జోస్యం చెప్పింది. కారణం ఏమిటంటే బీజేపీ అభ్యర్ధి వెంకటరమణా రెడ్డేనట. కామారెడ్డిలో రమణారెడ్డి మాత్రమే లోకల్. మిగిలిన కీసీయార్, రేవంత్ ఇద్దరు నాన్ లోకల్.
లోకల్-నాన్ లోకల్ అనే అంశం చాలా కాలంగా జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. కేసీయార్ గెలిచినా, రేవంత్ గెలిచినా ఇద్దరిలో ఎవరూ కామారెడ్డిలో ఉండరు. అదే రమణా రెడ్డి గెలిస్తే నియోజకవర్గంలోనే ఉంటారు. పైగా మొదటినుండి జనాలకు అందుబాటులోనే ఉంటున్నారట. ఆర్ధికంగా బాగా స్ధితిమంతుడైన రమణారెడ్డి చాలాకాలంగా జనాలకు ఏ సమస్య వచ్చినా మద్దతుగా నిలబడుతున్నారు. ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయమైన తర్వాత మాత్రమే కేసీయార్ కామారెడ్డిపైన దృష్టిపెట్టారు. అప్పటికే కేసీయార్ పైన జనాల్లో వివిధ కారణాలతో మండుతున్నారు.
కేసీయార్ కామారెడ్డిలో పోటీచేస్తున్నారు కాబట్టే రేవంత్ కూడా ఇక్కడ పోటీచేశారు. కానీ రమణారెడ్డి రాజకీయమంతా కామారెడ్డిలోనే జరుగుతోంది. మంచి వ్యక్తిగా, జనాలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పాపులర్ కాబట్టే రమణా రెడ్డికి జనాలు ఓట్లేసినట్లు ఒక విశ్లేషణ. బీజేపీ అభ్యర్ధి కాబట్టి రమణారెడ్డికి జనాలు ఓట్లేయలేదట. రమణారెడ్డి పోటీచేశారు కాబట్టి నియోజకవర్గం బీజేపీ ఖాతాలో పడుతోందని లెక్కేస్తున్నారు. మొత్తానికి ఆరా సంస్ధ అంచనా ప్రకారం కామారెడ్డిలో కేసీయార్ ఓటమి తప్పదనే అనిపిస్తోంది.