కేసీఆర్ ఈ మాట అంటాడా? సమస్యే లేదు ఇది రాంగ్ హెడ్డింగ్ అనుకుంటున్నారేమో. నూటికి నూటొక్క శాతం ఈ మాట అన్నది కేసీఆరే. అయితే, మహానుభావులు ఊరికే నోరు తెరవరు. నిన్ననే మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత్ బంద్ కు మద్దతు పలికిన కేసీఆర్ మరుసటి రోజే మోడీని పొగడటం వెనుక వ్యూహం ఏంటో మనం ఇపుడు అర్థం చేసుకుందాం.
కొత్త పార్లమెంటు భవనం కడుతున్న సంగతి తెలిసిందే. దాని పేరు సెంట్రల్ విస్టా బిల్డింగ్. మొన్ననే మనం గ్రాఫిక్ ఇమేజ్ కూడా చూశాం కదా. దీనిని ప్రశంసిస్తూ రేపుమోడీ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా కేసీఆర్ ఒక ప్రత్యేక లేఖ ద్వారా మోడీని అభినందించారు. కేసీఆర్ ఏమన్నారంటే…
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ ఆత్మగౌరవానికి, జాతి ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతమున్న పార్లమెంటు, కేంద్ర సచివాలయ భవనాలు అవసరాలకు తగినట్టుగా లేవనీ, పైగా అవి గత వలస పాలనకు చెందినవని, ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటినుంచో ఉందని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలని అన్నారు.
బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న ప్రస్తుత తరుణంలో మోడీని కేసీఆర్ పొగడటానికి కారణం రాష్ట్రంలో తాను నిర్మిస్తున్న కొత్త సచివాలయం. సచివాలయ నిర్మాణం విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉంది. ప్రతిపక్షాల్లో వ్యతిరేకత ఉంది. ఇంతవరకు దానిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ శతధా ప్రయత్నం చేసింది. అయితే, అదంతా దుబ్బాక, GHMC కి ముందు జరిగింది. ఇపుడు త్వరలో సచివాలయానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో తాజాగా మోడీకి లేఖ రాయడం ద్వారా బండి సంజయ్ కి, ధర్మపురి అరవింద్ కి ముందరి కాళ్లకు బంధం వేస్తూ రాసిన లేఖ ఇది.
రేపు వాళ్లు విమర్శిస్తే మీరు పార్లమెంటు భవనం కడితే నేను అభినందించాను. అదే తెలంగాణ బాగుపడుతుంటే మీరు చూడలేరు అంటూ రివర్స్ అటాక్ చేయడానికి కేసీఆర్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు.