కేసీఆర్ గురించి ఉండవల్లి సంచలన విషయం వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కడుతున్న ప్రాజెక్టుల వల్ల ఏపీకి జరుగుతున్న నష్టం గురించి తెలిసి కూడా ఏపీ నేతలు మాట్లాడలేరని, దీని వెనుక ఒకపెద్ద కారణం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు.
గోదావరి నదిపై తెలంగాణ అనేక ప్రాజెక్టులు కడుతోందని, ప్రాజెక్టులకు కట్టకూడదని దానిపై మాట్లాడితే జైలుకు పంపిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని వ్యాఖ్యానించారు. ఆంధ్రనేతల ఆస్తులు హైదరాబాదులో ఉండటం మూలాన ఇంకెవరు మాట్లాడతారని ఆయన అన్నారు. మాట్లాడితే ఆస్తుల విషయంలో కేసులు పెట్టి జైలుకు పంపిస్తారని వారందరినీ కేసీఆర్ బెదిరించడం వల్ల 151 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారన్నారు.
గోదావరి నదీ జలాలు నిరుపయోగం అవుతున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఏపీ దాటాక ఈ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని నిల్వ చేసేలా రిజర్వాయర్ కడితేనే పోలవరం వల్ల ఉపయోగం ఉంటుందని లేకపోతే లేదన్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వనని చెప్పినా జగన్ సైలెంట్ గా ఉంటే అది చాలా నష్టం అన్నారు.
పోలవరం నిర్మాణానికి పునరావాసం కింద పరిహారం ఇవ్వాలని, లక్షకు పైగా కుటుంబాలకు కేంద్రమే పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కేసీఆర్ కి, కేంద్రానికి భయపడితే ఏపీ పరిస్థితి అథోగతే అన్నారు. పోలవరం విషయంలో జగన్ నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు అని చెప్పారు.