నిన్న జరిగిన టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో బిజెపిపై సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన బిజెపి ఆఖరికి తన కూతురు కవితను కూడా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని కేసీఆర్ షాకింగ్ ఆరోపణ చేశారు. అంతేకాదు, ఏపీలో బిజెపికి వైసిపి అనుకూలంగా ఉన్నప్పటికీ జగన్ ను కూడా ఇబ్బంది పెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్ నే తాము బీజేపీలో చేర్చుకోలేదని, అలాంటిది కవితను ఎలా చేర్చుకుంటామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎలాంటి యుద్ధం చేసినా తాము సిద్ధంగానే ఉన్నామని బండి సంజయ్ అన్నారు. ఇంకా చెప్పాలంటే, టిఆర్ఎస్ కంటే ముందే తాము యుద్ధం ప్రారంభించామని బండి సంజయ్ అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్ల లక్ష్యంతో పనిచేస్తున్నామని, కేసీఆర్ లో ఓటమి భయం మొదలైందన్న సంగతి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గుర్తించారని అన్నారు.
టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంపై ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి బలోపేతం కాకుండా చూడాలని, అదే సమయంలో టిఆర్ఎస్ కూడా గెలవాలని కేసీఆర్ చెబుతున్నారని విమర్శించారు. మరోవైపు, టాలీవుడ్ దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు సిఫారసు చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. అంతేకాదు, హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సంజయ్ అన్నారు.