సంచలన అంశం వెలుగు చూసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు తొలిసారిగా తెర మీదకు వచ్చినట్లుగా చెబుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును చెప్పినట్లుగా తెలుస్తోంది.
చిన్న విమర్శ చేసినా పెద్దాయనకు చిరాకుగా పేర్కొన్న రాధాకిషన్ రావు.. విపక్ష నేతలు.. కేసీఆర్ కు ఇబ్బందిగా ఉన్న వారితో పాటు వారి సన్నిహితుల ఫోన్ల మీదా నిఘా పెట్టినట్లుగా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీగా వ్యవహరించిన రాధాకిషన్ రావు సంచలన అంశాల్ని పోలీసుల విచారణలో వెల్లడించారని.. ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ట్యాపింగ్ కేసు పార్టు 2 ఉంటుందని.. పలు సంచలన అంశాలు చోటు చేసుకోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు అందాల్సిన ఆదేశాల్ని సీపీల ద్వారా వచ్చేట్లుగా తాము చూసుకున్నట్లుగా సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కీలక పాత్ర పోషించిన ప్రణీత్ కుమార్.. పైనుంచి వచ్చిన ఆదేశాల్ని తూచా తప్పకుండా ఫాలో కావటంతో పాటు.. వారు పేర్కొన్న పేర్లకు సంబంధించినవారి ఫోన్లను ట్యాప్ చేయటం.. ఆ సమాచారంతో బెదిరింపులకు పాల్పడటం చేసినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థుల్ని.. వారికి ఆర్థికంగా సాయం అందించే వారిని బెదిరించి లొంగదీసుకునేవారమని.. సివిల్ తగాదాల్లో సెటిల్ మెంట్లు చేసే వారమని.. ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునే వాళ్లమన్న పలు అంశాల్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకురానప్పటికీ.. పోలీసు ఉన్నతాధికారుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారంతో ఈ సంచలన అంశాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు పేర్లు వచ్చినప్పటికీ.. కేసీఆర్ పేరు మాత్రం తొలిసారి వెలుగు చూసింది. మరి.. దీనిపై గులాబీ బాస్ అండ్ కో ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలుగు చూసిన ఈ సమాచారం.. ఎంపీ ఎన్నికల్లో ప్రచారాంశం కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.