తెలంగాణలో నేడు టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా టీఆర్ఎస్ వేడుకలు జరుపుకుంటోంది. మరోవైపు నేడు తెలంగాణ విమోచన దినోత్సవం అంటూ బీజేపీ సభలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా…కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే అమిత్ షా పై కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండాను కేసీఆర్ ఎగరవేశారు. కొందరు మతతత్వంతో తెలంగాణలో అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మనుషుల మధ్య విభజన చేస్తూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారని పరోక్షంగా బీజేపీని దుయ్యబట్టారు.
ఆ దుష్టశక్తుల ప్రయత్నాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ నేతలనుద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేల ప్రశాంతంగా ఉండాలని, మళ్ళీ బాధల్లోకి వెళ్ళకూడదని అన్నారు. మనం ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా కొన్ని దశాబ్దాల పాటు అనుభవించిన వేదనను మళ్ళీ అనుభవించాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు మరోవైపు అమిత్ షా కాన్వాయ్ కు టీఆర్ఎస్ నేత ఒకరు కారు అడ్డంగా పెట్టారని అమిత్ షా భద్రతా సిబ్బంది ఆరోపిస్తున్నారు.
కావాలనే కారు అడ్డంగా పెట్టారని ఆరోపించిన ఆ సిబ్బంది కార్యకర్త కారు అద్దాలను ధ్వంసం చేయడం చర్చనీయాంశమైంది. బేగంపేట హరిత ప్లాజా హోటల్లోకి అమిత్ షా కాన్వాయ్ రాబోతున్న సందర్భంగా ఎంట్రన్స్ గేట్ వద్ద ఆ కార్యకర్త కారు అడ్డంగా ఉంది. దానిని తొలగించాలని ఎన్ఎస్ జీ సిబ్బంది చెప్పారు. అయితే, భద్రతా సిబ్బంది వచ్చిన కంగారులో కారు తీయడానికి కొంత సమయం పట్టిందని ఆయన వివరణ ఇచ్చారు. కానీ, ఈ లోపే తన కారు అద్దాలను ధ్వంసం చేశారని ఆరోపించారు.