2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే. జగన్ కు ఎన్నికల సమయంలో వెన్నుదన్నుగా ఉన్న కేసీఆర్…జగన్ గెలిచిన తర్వాత కూడా తమ మైత్రి బంధాన్ని కొనసాగించారు. అయితే, ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వ్యవహారం, జల జగడం నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని టాక్ ఉంది.
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా జగన్ పై కేసీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే తెలంగాణ చీకటి అయిపోతదని, తెలంగాణలో కరెంటు రాదని నాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పారని గుర్తు చేశారు. కానీ, ఇపుడు అదే ఆంధ్రాలో కరెంటు లేదని, కానీ, తెలంగాణలో 24 గంటలు కరెంటు ఉందని జగన్ ను ఉద్దేశించి కేసీఆర్ చురకలంటించారు.
ఏ ఆంధ్రప్రదేశ్ నుంచయితే విడిపోయామో…ఆ ఆంధ్రప్రదేశ్ పర్ కాపిటా ఇన్ కం లక్షా 70 వేల కోట్లు అని, అదే తెలంగాణ పర్ కాపిటా ఇన్ కం 2 లక్షల 30 వేల కోట్లు అని కేసీఆర్ ఏపీ ఆర్థిక దుస్థితిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అభివృద్ధఇలో ఎక్కడ ఆంధ్ర..ఎక్కడ తెలంగాణ అంటూ జగన్ పాలనను కేసీఆర్ ఎండగట్టారు. ఇవి వాస్తవాలని, జరిగిన సత్యాలని కేసీఆర్ అన్నారు.
ఏపీలో కొద్ది రోజులకుగా కొన్ని జిల్లాల్లో కరెంటు కోతలు విధిస్తోన్న సంగతి తెలిసిందే. బొగ్గు కొరత వల్ల కరెంటు కోతలకు సిద్ధమైన జగన్…ఈ సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ఏపీలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా…ప్రస్తుతం 145 మిలియన్ యూనిట్లే సరఫరా అవుతోంది. డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో…కోతలు తప్పనిసరిగా విధించాల్సిన ఆగత్యం ఏర్పడింది.