ఒక మనిషి ఎదగాలనుకోవడంలో తప్పు లేదు. దేవుడు ఈ సృష్టిలో ప్రతిజీవికి సొంత ఆలోచన ఇచ్చింది అందుకే. కానీ ఆ ఎదిగే క్రమంలో స్వయంకృషిని నమ్ముకోవాలి కాని… పక్కవాడి కాళ్లు లాగి కింద పడేసి ఎదగాలి అని అనుకోకూడదు. ధర్మం తప్పితే ఆ శాపం కచ్చితంగా తగులుతుంది. టైం బాగున్నపుడు శాపాలు పనిచేయకపోవచ్చు. కానీ ఏదో ఒకరోజు కచ్చితంగా ఆ శాపం తగలక మానదు. కేసీఆర్ కి ఆరోజు వచ్చేసింది.
దేశంలో ఇప్పటికే ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పాడ్డాయి. ప్రతి రాష్ట్రమూ విడిపోయి అభివృద్ధి చెందాలని అనుకున్నాయి. తమ కష్టంతో తాము పైకొద్దాం అనుకున్నాయి. అందుకే ఎవరంతట వారు ముందుకు పోతున్నారు. కానీ కేసీఆర్ అందరికీ భిన్నంగా ఆలోచించారు. ధర్మం తప్పారు. తమ రాష్ట్రం ముందుకు వెళ్లడానికి అభివృద్ధి చేసుకోవడానికి కష్టపడాల్సిందిపోయి ధర్మం తప్పి తప్పుదారిలో నడిచారు.
చంద్రబాబు మరోసారి గెలిస్తే అమరావతి మహానగరం పూర్తవుతుంది. పోలవరం పూర్తవుతుంది. ఆ రెండు పూర్తయితే… తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు ఆనదు. అమరావతితో పోటీ పడలేక రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలుతుంది. ఆస్తుల విలువ పడిపోతుంది. ఐటీ కంపెనీలు అన్నీ అటువైపు తరలిపోయే అవకాశం ఉంది. నిజానికి దీనిని ఆపడానికి, హైదరాబాదు వెనుకపడకుండా ఉండటానికి మార్గాలున్నాయి. కానీ ఆ పనిచేయడం కష్టతరం. దానికి చాలా కష్టపడాలి. అది చేయడం కంటే ఆంధ్రప్రదేశ్ ను ఆపేయడం సులువు కదా అనుకున్నారు కేసీఆర్.
జగన్ కి ఎన్నికల్లో సహకరిస్తే, తెలుగుదేశం నేతలను హైదరాబాదు వ్యాపారాలను అడ్డంపెట్టుకుని జగన్ కి అండగా ఉండాలని ‘ఫోర్స్‘ చేస్తే జగన్ గెలవడం నల్లేరుమీద నడక అవుతుంది. భవిష్యత్తు నగరం అమరావతితో పోటీపడటం కంటే దాన్ని ఆపడమే సులువు కాబట్టి ధర్మం తప్పి… గెరిల్లా యుద్ధంతో చంద్రబాబు సర్కారును కూల్చే తెరవెనుక రాజకీయం నడిపారు. దీంతో జగన్ పని సులువైంది.
వైసీపీ పన్నిన రాజకీయ వ్యూహాలను అమలుచేయడం, వారి అబద్ధాలను ప్రచారం చేయడానికి కేసీఆర్, ఆయన మీడియా అహర్నిశలు పనిచేశాయి. టీఆర్ఎస్ క్యాడర్ చంద్రబాబు చేయని తప్పులను పదేపదే ప్రచారం చేశాయి. ఏపీ వృద్ధిని దాచిపెట్టాయి. దీంతో ప్రజలకు నిజాలు చేరకపోవడంతో అబద్ధాలకు గెలుపు దక్కింది. కట్ చేస్తే కేసీఆర్ కోరిక నెరవేరింది. తన మనిషి జగన్ పదవిలోకి వచ్చారు. కానీ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన జగన్, ఒక వర్గపు శక్తిని శక్తిమంతంగా వాడుకోగలిగిన జగన్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో కేసీఆర్ కనిపెట్టలేకపోయారు.
ధర్మం తప్పిన కేసీఆర్ పై శాపగ్రస్తుడిగా మారారు. అక్కడ అన్న అధికారంలోకి వచ్చేసరికి చెల్లి షర్మిలకు వెయ్యేనుగుల బలం వచ్చింది. ఇపుడు తెలంగాణలో అత్యధికంగా, ప్రభావితంగా ఉన్న రెడ్డి వర్గాన్ని ఇపుడు జగన్ లాగేసుకుంటున్నారు. అంతేకాదు, ఆంధ్రాబలాన్ని, హైదరాబాదులో వేగంగా ఎదుగుతున్న ముస్లిం, క్రిస్టియన్ సామాజిక వర్గాలను కూడా షర్మిల వైపు తిప్పుకోవడానికి పరోక్షంగా ప్రశాంత్ కిషోర్ ద్వారా జగన్ పావులు కదిపారు.
అయినా… అధికారంలో ఉండగా చంద్రబాబును ప్రభావితం చేయగలిగిన కేసీఆర్, మళ్లీ తనపై అలా చేయడు అని గ్యారంటీ ఏంటి? అయినా అవకాశం ఉన్నపుడు, తండ్రి వారసత్వం ఉన్నపుడు దాన్ని ఎందుకు ఊరికే వదిలేయాలి అని భావించిన జగన్ చెల్లిని పరోక్షంగా రంగంలోకి దింపారు. కేసీఆర్ బలహీన పడటమే బీజేపీ పెద్దల కల కావడంతో ఎలాగూ జగన్ లాగేసే ఓట్లు తనవి కానపుడు తనకు ఉపయోగమే కదా అని కేంద్రం జగన్ కి అండగా నిలిచింది. ఇవన్నీ వెరసి ధర్మం తప్పిన కేసీఆర్ ను ఆ ధర్మమే శిక్షిస్తోంది. చేసిన తప్పునకు శిక్ష అనుభవిస్తున్నారు కేసీఆర్.
ఇప్పటికే మేనల్లుడి, కోడలి వల్ల ఇంటి పోరును అనుభవిస్తున్న కేసీఆర్ కి ఒకవైపు బీజేపీ, మరో వైపు షర్మిల కాలనాగులై కాటేస్తున్నాయి. అమరావతిని, పోలవరాన్ని అన్యాయంగా అక్రమంగా ఆగిపోవడానికి ప్రధాన పాత్ర పోషించినందుకు కేసీఆర్ కు తగిన శాస్తి జరిగిందని రాజకీయ విశ్లేషకులు బలంగా విశ్వసిస్తున్నారు.