18 ఏళ్ల నాటి హామీని.. సీఎం అయిన ఏడేళ్లకు నిలబెట్టుకోవుడా సారూ?

రాజకీయ నేతలు గొప్పలు చెప్పుకోవటం అలవాటే. కానీ.. తప్పును ఒప్పుగాచిత్రీకరించి.. తమను తాము హీరోగా ఫోకస్ చేసుకునే వైనం చూసినప్పుడు.. వారి తెలివికి అబ్బురపడాల్సిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితే మరోసారి చోటు చేసుకుంది. మరికొద్ది నెలల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దుబ్బాక.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఎదురుదెబ్బల అనంతరం జరుగుతున్న ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో.. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి అయిన నేపథ్యంలో.. విజయవకాశాలకు ఉన్న మార్గాల్ని గడిచినకొద్దిరోజులుగా వెతుకుతున్నారు కేసీఆర్.
ఇటీవల జరిగిన రెండు ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న తప్పుల్ని సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రిపీట్ కాకూడదన్న ఆలోచనలో ఉన్న ఆయన.. తన తీరుకు భిన్నంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు కేసీఆర్. సాగర్ ఉప ఎన్నికల్లో స్థానికుల మద్దతు మాత్రమే కాదు.. నల్గొండ జిల్లా ప్రజల సానుకూలత అవసరమన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. కొత్త వ్యూహాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.


అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం.. అంటే 2003 నాటి సమయంలో తాను ఇచ్చిన హామీని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ ఎడమ కాల్వ ఆయుకట్టుకు నీరు ఇవ్వకుండా పొలాల్ని ఎండబెట్టిన వేళ.. అందుకు నిరసనగా కేసీఆర్ 2003లో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన హాలియా బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. ఎడమ కాల్వ ఆయుకట్టుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగు నీరు అందిస్తానని మాట ఇచ్చారు. తాజాగా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికను సిద్ధం చేయటమే కాదు.. ఈ నెల పదిన శంకుస్థాపన  చేస్తున్నారు. ఉన్నట్లుండి.. 23 ఏళ్ల నాటి తన హామీ కేసీఆర్ సారుకు ఇప్పుడు గుర్తుకు రావటం ఆసక్తికరం. ఒకవేళ.. ఇప్పుడు కానీ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రాకుంటే.. తానిచ్చిన హామీ కేసీఆర్ సారుకు గుర్తుకు వచ్చేదా? అన్నది ప్రశ్న. ఒకవేళ.. అవునన్నదే సమాధానం అయితే.. 23 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట ఇంతకాలం ఎందుకు గుర్తుకు రాలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకటర్మ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయటమేకాదు.. రెండో టర్మ్ లోనూ గుర్తుకు రాలేదు. సాగర్ ఉప ఎన్నిక పుణ్యమా అని ఇప్పుడు గుర్తుకు వచ్చిందే తప్పించి.. మరింకేమీ లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఈ విమర్శకు కేసీఆర్ సారు ఏమని బదులిస్తారో చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.