సారు కారు పదహారు అన్న బడాయి 2 ఏళ్లలో పటాపంచలు అయ్యింది. కేవలం రెండు చిన్న ఎన్నికల ఓటమితో ఆకాశం నుంచి నేలమీదకు దిగొచ్చింది కేసీఆర్ సర్కారు అత్యుత్సాహం. ఇటీవలే బలవంతపు నియంత్రిత సాగును రైతుల మీద రుద్దినందుకు రైతులే కాకుండా ప్రభుత్వం 7500 కోట్లు నష్టపోయిందట. దీంతో కేసీఆర్ సర్కారుకు మతిపోయిందట. దెబ్బకు నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
పూర్వాపరాలు చూస్తే ఇది కొంచెం వివరంగా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో రైతు బంధు పథకం కింద ఎకరాకు 10 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాది నుంచి కేసీఆర్ దీనికి ఒక లింకు పెట్టారు. రైతులు ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే ఆ డబ్బులు వస్తాయని చెప్పారు. పోన్లే అని రైతులు ప్రభుత్వం చెప్పినట్టు వేశారు. అలా వేస్తే తామే ఆ పంట కొంటామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పంట పండాక కొనక తప్పలేదు. ఈ క్రమంలో సరైన పంట రాక రైతు నష్టపోయారు. దానిని తప్పక కొనాల్సి రావడతో ప్రభుత్వం 7500 కోట్లు నష్టపోయిందట.
అసలే కరోనా నష్టంతో విలవిల్లాడుతున్న కేసీఆర్ సర్కారుకు ఎన్నికల ఓటమి ఒకవైపు… ఈ అదనపు భారం ఒకవైపు మీదపడటంతో ఊపిరి ఆడని పరిస్థితి. రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్స్ వల్ల కేంద్రంతో అనవసర శత్రుత్వం. పోనీ ఎవరైనా కలిసొచ్చే వారున్నారా అంటే సొంత ఫ్రెండు అసద్ కూడా బీజేపీ జేబులో మనిషిలా మారిపోయాడు. దీంతో కేసీఆర్ మొన్నటికి మొన్న భారత్ బంద్ ను విజయవంతం చేసి… ఇపుడు చప్పబడ్డారు. ఇంటా బయట వస్తున్న విమర్శల దాడితో నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుుంది. రైతులు నచ్చిన పంట వేసుకోవచ్కని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేకాదు, ఇక గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కూడా రద్దు చేసిన ప్రభుత్వం రైతులు పంటను ఇష్టం ఉన్నచోట అమ్ముకోవచ్చని పేర్కొంటు పరోక్షంగా మోడీ సర్కారు తెచ్చిన వ్యవసాయ చట్టాలకు జైకొట్టినట్టు అయ్యింది.