తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారని, అందుకే తన తనయుడు, మంత్రి కేటీఆర్ ను సీఎం చేయబోతున్నారని తెలంగాణలో కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదేదో మీడియాలో వచ్చిన వార్తయితే….గాసిప్ అనుకొని జనాలు గప్ చుప్ గా ఉండేవారు. అయితే, ఏకంగా టీఆర్ఎస్ కీలక నేతలు సైతం…కేటీఆర్ సీఎం అయితే తప్పేంటంటూ ప్రకటనలివ్వడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. ఇక, మరికొందరైతే ఈటల సీఎం కావాలని తమకు నచ్చిన విధంగా ప్రకటనలిచ్చారు.
దీనికితోడు, కేసీఆర్ తరఫు నుంచి ఈ ప్రకటనపై ఖండనలేకపోవడంతో ఇది గులాబీ బాస్ కు తెలిసిన విషయమేనని అంతా అనుకున్నారు. అయితే, తాజాగా ఆ ఊహాగానాలకు, అనధికారిక ప్రకటనలకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. తెలంగాణ సీఎంగా తానే కొనసాగుతానని, కేటీఆర్ సీఎం అని ఎవరైనా మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడతానని కేసీఆర్ తనదైశ శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారన్న ప్రచారాన్ని కేసీఆర్ సారు ఖండించారు. తన రాజీనామా కోసం ఎదురుచూస్తున్నారా అని టీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ప్రశ్నించారు. మరోసారి ఎక్కడైనా లూస్ టాక్ చేస్తే బండకేసి కొట్టి పార్టీ నుంచి బయట పారేస్తానని కేసీఆర్ మండిపడ్డారు.
తానే సీఎం అని అసెంబ్లీ సాక్షిగా గతంలోనే చెప్పానని, అయినా, మళ్లీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఇంకో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. సారు తాజాగా ఇచ్చిన క్లారిటీతో కేటీఆర్ సీఎం అన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. అయితే, దాదాపు 15 రోజులుగా కేటీఆర్ సీఎం అంటూ ప్రచారం జరుగుతుంటే….సారు ఇంత లేటుగా …ఇంత ఘాటుగా ఎందుకు స్పందించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.