హుజూరాబాద్ ఎన్నిక తెలంగాణలో అనేక మార్పులకు కారణం అవుతోంది. ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకునే కేసీఆర్ ను బజారుకు లాగేసింది. కేసీఆర్ ను నిత్యం ప్రజల జపం చేసేలా చేస్తోంది.
తాజాగా మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ బీజేపీ మీద విమర్శలు మొదలుపెట్టారు. ఈరోజు ప్రెస్ మీట్లో వరి ధరలు, పెట్రోలు ధరలే ప్రధానంగా కేసీఆర్ మాట్లాడారు
దేశ వ్యాప్తంగా ఈ సారి వరి దిగుబడి పెరిగింది. ఇక తెలంగాణలో అయితే, రైతులు ఇబ్బడిముబ్బడిగా వరి పంటను వేశారు. దీంతో పంటను కొనుగోలు చేసేవారే లేకపోవడంతో రైతులు దిగులు పడుతున్నారు. వారు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇది రైతుల్లో కేసీఆర్ పై ఆగ్రహాన్ని పెంచుతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… కేంద్రం ఒప్పు చేసినా, తప్పు చేసినా లాభం నష్టం రెండూ స్థానిక ప్రభుత్వాలకే చెందుతాయి. ఇన్ కం ట్యాక్స్, బడ్జెట్ వంటి అతి స్వల్పమైన విషయాలే ప్రజలు కేంద్రం మీద దృష్టిపెడతారు. కానీ చాలా విషయాలకు ప్రజలు రాష్ట్రాన్నే నిందిస్తారు. మంచి జరిగితే అభినందిస్తారు.
తాజాగా రైతులకు తనపై ఉన్న కోపాన్ని కేసీఆర్ కేంద్రం మీదకు తోసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని సీఎం కేసీఆర్ ఆరోపణ చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కేంద్రం మా నుంచి తీసుకోకుంటే ఏం చేస్తాం?
రాష్ట్రం నుంచి పండించిన పంటలను (నూక బియ్యం) సేకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అలాగే సేకరించిన పచ్చి బియ్యాన్ని తీసుకోవాలని కోరారు. సంబంధిత కేంద్ర మంత్రి నిర్ణయం తీసుకుంటారని, ఆయనతో సంప్రదింపులు జరుపుతారని చెప్పారు కానీ ఇప్పటి వరకు స్పందన లేదు అని కేసీఆర్ నోటికొచ్చింది అనేశారు. ఎందుకంటే కేసీఆర్ చెప్పింది అబద్ధం అని రేపు కేంద్ర మంత్రి చెప్పినా ఆ మాట పెద్దగా మీడియాలో రాదన్న నమ్మకంతో కేసీఆర్ అనేశారు.
కేంద్రం రాష్ట్రం నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలంటున్న కేసీఆర్ అసలు రైతుల నేటి కష్టాలకు మూలకారకుడు. తెలంగాణ రైతులు పసుపు, మొక్కజొన్న, జొన్న, వరి, పత్తి, మిరప, చెరకు ఇలా వైవిధ్యమైన పంటలు పండించేవారు. దీనివల్ల వారు ఎపుడూ ప్రభుత్వం మీద ఆధారపకుండా మంచి ధర దొరికేది.
కేసీఆర్ వచ్చాక టార్గెట్లు పెట్టి మరీ వరిసాగును ప్రోత్సహించారు. గోదారి జిల్లాలే పచ్చగా ఉంటాయి, అలా ఉండాలంటే వరే పండాలన్న భ్రమను ప్రజలకు ఎక్కించి వారిని కేసీఆర్ సర్కారు తప్పుదారి పట్టించింది. ఇపుడు మొదటికే మోసం వచ్చింది.
ఇపుడు తనకిందకు నీళ్లు వచ్చేసరికి ఈసారి వరి వేయొద్దు అని కేసీఆర్ చెబుతున్నారు. నీళ్లు ఎక్కువైపోయినపుడు రైతులు వరే వేస్తారు. ఎందుకంటే నీటికి అనుగుణంగా పంట వేస్తేనే పంట చేతికి అందుతుంది. అధికంగా నీరు పారే చోట పత్తి, వేరుశెనగ వేస్తే రైతు నష్టపోతాడు. ఈరోజు కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది.
ప్రమాదం ముంచుకువచ్చినపుడు తప్పును వేరే వారి మీదకు నెట్టేస్తే ప్రజలు క్షమిస్తారు అనుకోవడం భ్రమ.