రాజకీయ కుటుంబాలకు చెందిన వారసుల కారణంగా.. రాజకీయంగా తిరుగులేని రీతిలో దూసుకెళ్లే ప్రముఖులకు అప్పుడప్పుడు అనుకోని రీతిలో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితిని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆరర్ ఎదుర్కొంటున్నారన్న మాట వినిపిస్తోంది. తెలుగురాజకీయాల్లో సన్ స్ట్రోక్ లు చూశామే కానీ.. ఇలా డాటర్ స్ట్రోక్ లు ఎదురు కాలేదన్న మాట వినిపిస్తోంది.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు తొలిసారి రావటం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలు మరింత చర్చకు కారణమయ్యాయి. కేంద్రంలో పంచాయితీ నడుస్తున్న వేళ.. కవిత కారణంగా తాను చిక్కుల్లో పడిన వైనంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారని.. తన సన్నిహితుల ఎదుటే కవితపై కేసీఆర్ కోపాన్ని ప్రదర్శించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కవిత.. ఒక మీడియా అధినేతను నేరుగా ప్రశ్నిస్తూ.. మీరు చూసినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించటం తెలిసిందే.
ఆ ఇంటర్వ్యూలో కవిత వ్యాఖ్యలకు సదరు మీడియా అధినేత స్పందిస్తూ.. ‘మీ నాన్న ఏమేం మాటలు అన్నారో చెప్పమంటే చెబుతాను’ అని సూటిగా చెప్పేయటం.. దానికి కవిత వేరే టాపిక్ లోకి తీసుకెళ్లటం అప్పట్లో సంచలనంగా మారింది. సదరు ఇంటర్వ్యూ ద్వారా తన మీద పడిన మరకను తుడుచుకోవటానికి వచ్చిన ఆమె.. అనవసరంగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్న మాట వినిపించింది.
ఇప్పటికే ఢిల్లీ స్కాంలో కవిత పేరు వినిపించటం.. దానిపై స్పందించిన కవిత తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పటం తెలిసిందే. అయితే.. అరబిందోఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో మరోసారి కవిత పేరు బయటకు వచ్చింది. ఇదే సమయంలో ప్రైవేటు జెట్ లను సమకూర్చే సంస్థ అధినేత్రి కనికారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయటం తెలిసిందే.
అందులో హవాలా మార్గంలో నేరుగా ప్రైవేటు జెట్ లలో సొమ్ములు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి వేర్వేరు ప్రాంతాలకు తరలినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనే కవిత పేరు వినిపిస్తోంది. తాజాగా లైగర్ మూవీలోకవిత పెట్టుబడులు పెట్టినట్లుగా కాంగ్రెస్ నేతచేసిన ఆరోపణలపై తాజాగా ఆ చిత్ర దర్శకుడు పూరీ.. సహ నిర్మాతగా వ్యవహరించిన చార్మీని విచారణకు పిలవటం లాంటి వ్యవహరాల్ని చూస్తే.. రానున్న రోజుల్లో కవిత ఇబ్బందులు ఎదురు కానున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇంతకాలం కొడుకుల కారణంగా రాజకీయ అధినేతలకు.. రాజకీయ ప్రముఖులకు తలనొప్పులు ఎదురయ్యాయని.. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి డాటర్ స్ట్రోక్ ఇదే మొదటిదిగా పేర్కొంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొత్తంగా కవిత లక్ష్యంగా సాగుతున్న విచారణలు చివరకు ఎక్కడి వరకు వెళతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సరైన సమాధానం కాలమే ఇస్తుందని చెప్పక తప్పదు.