నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర బుధవారం అర్ధరాత్రి హైడ్రామా ఏర్పడిన సంగతి తెలిసిందే. డ్యామ్ లో సగభాగాన్ని ఏపీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని బారికేడ్లు పెట్టడం, కొన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం సంచలనం రేపింది. ఇప్పటికీ ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు.
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమయంలో నీటి గొడవ ఓట్ల కోసమేనని ఇది ఘోరాతిఘోరమని మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకే ఇటువంటి ఘటనలు చేస్తున్నారని ఆరోపించారు. 400 మండలాల్లో కరువు ఉంటే 100 మండలాలకే దానిని పరిమితం చేశారని, ఇది ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ అని ఆరోపించారు.
పోలింగ్ రోజు ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకే కేసీఆర్ ఈ కొత్త కుట్రకు తెరతీశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇటువంటి కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తారని, ఆలోచించి ఓటు వేస్తారని చెప్పారు. ఈ వివాదంపై ఎలక్ట్రోరల్ అధికారులు స్పందించి పరిష్కరించాలని కోరారు.
పోలింగ్ రోజు ఎన్నికల లబ్ధి పొందేందుకే సాగర్ దగ్గర నీటి పంచాయతీ పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి కేసీఆర్ కు లబ్ధి చేకూర్చేందుకే హైడ్రామా నడుపుతున్నారని, జగన్, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని ఆరోపించారు.