కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత.. డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.
సిస్టర్ ఆఫ్ కల్వకుంట్ల తారకరామారావు.
తెలంగాణకు పరిచయం అక్కరలేని పేరు.
ప్రస్తుతం దేశానికి కూడా పరిచయం అవసరం లేని పేరు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అత్యంత ప్రముఖపాత్ర పోషించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూఢీగా చెపుతున్న పేరు.
కవిత, కేసీఆర్, శోభల గారాలపట్టిగా పుట్టి, బాగా చదువుకుని (కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, అమెరికాలో ఎంఎస్) యూఎస్‌లో ఉద్యోగం కూడా చేశారు.
దేవనపల్లి అనిల్‌కుమార్‌ను పెళ్లిచేసుకుని భర్తతో తిరిగి 2003లో అమెరికా వెళ్లిన కవిత, 2006లో భారత్‌కు తిరిగివచ్చారు.
అప్పటికి తండ్రి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తలమునకలుగా మునిగి ఉన్నాడు.
ఆయనకు చేదోడువాదోడుగా ఉంటూ, ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి, తెలంగాణ సంస్కృతికి, ఆచారాలకు, పండుగలకు ప్రపంచవ్యాప్తంగా పెద్దయెత్తున ప్రచారం కల్పించింది.
చాలా దేశాల్లో జాగృతి శాఖలను ఏర్పాటు చేసి తెలంగాణకు విస్తృత ప్రచారం లభించేలా చేశారు.
తద్వారా తను కూడా చాలా పేరు తెచ్చుకున్నారు.
అప్పుడంతటా తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, భాషకు, యాసకు, ఆచారాలకు అవమానాలే.
అందుకు తెలుగు సినిమాలు మినహాయింపు కాదు.
కమెడియన్లకు, విలన్లకు తెలంగాణ పాత్రలు అంటగట్టి అవమానించేవారు.
దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కవిత.. సినిమా రంగానికి టెర్రర్‌గా మారారు.
అప్పటికి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో మహోధృతంగా మారింది.
ఆంధ్రా సెటిలర్ వ్యాపారస్థులు, సినిమా నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది.
ఇక్కడే ఆమె పాత్ర మరో మలుపు తిరిగింది.
తెలంగాణను అవమానపరిచే సన్నివేశాలు, పాత్రలు ఉన్న సినిమాలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి, పెద్దఎత్తున వసూళ్లు చేశారని సినిమా రంగం వారు కథలు కథలుగా ఈనాటికీ చెప్పుకుంటారు.
అంతే కాకుండా, రియల్ ఎస్టేట్‌లో సెటిల్మెంట్ల ద్వారా కూడా విపరీతంగా సంపాదించిందని చెపుతారు.
నిజానికి కేసీఆర్ ఉద్యమం నడిపే క్రమంలో, పార్టీకి సరైన నిధులు కూడా ఉండేవి కావు.
కానీ అదే టైమ్‌లో కవిత వద్ద వందల కోట్లు ఉన్నాయని అప్పటి టీఆర్ఎస్ నాయకులు చెప్పేవారు.
ఇదంతా కవిత ఎదుగుదల ఎలా జరిగిందనేది తెలియడం కోసం చెప్పింది మాత్రమే.
ఇక నిజామాబాద్ నుండి ఎంపీగా ఎన్నికై, ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత చాలా త్వరగా అక్కడ కూడా పాపులర్ అయ్యారు.
ఇంగ్లిష్ చాలా బాగా మాట్లాడటం తనకు ప్లస్ అయింది.
దాంతో పరిచయాలు కూడా బాగా పెరిగాయి.
పార్లమెంట్ కమిటీల్లో స్థానం దక్కింది.
ఎంపీ హోదాలో పలుదేశాల్లో పర్యటించింది.
ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు.
ఇక అక్కన్నుంచీ తను వెనుదిరిగి చూడలేదు.
ఎక్కడ డబ్బు పుడుతుందో అక్కడ వాలిపోవడం ప్రారంభించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
తన కార్యకలాపాలు తండ్రికి పెద్దగా తెలిసేవి కావని చెబుతారు.
అంత టైమ్ ఆయనకు ఉండేదీ కాదు.
అడపాదడపా కేటీఆర్ హెచ్చరించినా పెడచెవిన పెట్టారని విశ్వసనీయవర్గాలు చెబుతుంటాయి.
నిజానికి కేసీఆర్‌కు కవిత అంటే పెద్దగా ఇష్టముండదని, తన పద్ధతులు, అవినీతి కార్యకలాపాలంటే ఆయనకు కోపమని పేర్కొంటున్నాయి.
కానీ, ఎంతయినా బిడ్డ కదా.
అదే కొంపముంచింది.
ఎక్కడో ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ రూపొందించబోతోందని ఎలాగో తెలుసుకున్న కవిత మాస్టర్ ప్లాన్ వేశారని, వెంటనే ఆప్ ప్రభుత్వ పెద్దలను కలిసి, రకరకాలుగా ప్రలోభపెట్టి, పాలసీని అవినీతికి అనుకూలంగా ఉండేట్టు తయారుచేయించారనేది దర్యాప్తు సంస్థల అభియోగం.
ఇందులో మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కొడుకు రాఘవ్, బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా శరత్చంద్ర, అరుణ్ పిళ్లై, ఢిల్లీకి చెందిన సుఖేశ్ చంద్రశేఖర్, గురుగ్రామ్‌కు చెందిన అమిత్ ఆరోరాలు ముఖ్య భూమికలు పోషించారు.
ఇందులో దక్షిణాది చెందిన వారిని సౌత్ గ్రూప్ లాబీగా పేర్కొన్నారు.
ఆ ప్రలోభాల్లో భాగమే పంజాబ్ ఎన్నికలు గెలవడమని, దానికి పడిపోయిన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కవిత ప్రపోజల్‌కు ఒప్పుకున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
దాంతో వెంటనే 100 కోట్ల రూపాయలు వారికి పంపే ఏర్పాట్లు చేశారని పేర్కొంటున్నాయి.
ఇక అక్కన్నుంచి మద్యం పాలసీ ద్వారా మద్యం కొనుగోలు, పంపిణీ, డీలర్ల కమీషన్, ఎంఆర్పీ అన్నీ మారిపోయాయి.
విచ్చలవిడి అమ్మకాల ద్వారా డీలర్ల కమీషన్ పెంచడం ద్వారా, 200 కోట్లకు పైగా ఇప్పటివరకు సంపాదించిందని ఈడీ వర్గాల ఆరోపణ.
ఇందులో డబ్బులను పెద్దయెత్తున అటూ-ఇటూ తరలించిన మోసగాడు సుఖేశ్‌ను సీబీఐ అరెస్టు చేసి, తీగ లాగితే డొంకంతా కదిలింది.
మొత్తం ఢిల్లీ ప్రభుత్వమే ఈ లిక్కర్ గేట్లో ఇరుక్కుపోయింది.
ఎప్పడైతే మనీ లాండరింగ్ జరిగిందని తెలిసిందో, అప్పుడు ఈడీ ప్రవేశించి, చాలా సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించింది.
సుఖేశ్ అప్రూవర్‌గా మారిపోయి, అందరి జాతకాలు బయటపెట్టాడు.
అందులో భాగంగానే ఒక్కొక్కరుగా సత్యేంద్రజైన్, మనీశ్ సిసోడియా జైలుకు బయలుదేరారు.
ఈ విషయంలో కవితను సీబీఐ, ఈడీ చాలాసార్లు సాక్షిగా విచారించినప్పటికీ, తన దగ్గర నుండి సరైన సమాధానాలు రాలేదు.
దాంతో తెలివిగా వ్యవహరించిన ఈడీ, కవితకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు.
దీనికి సుఖేశ్ పూర్తిగా సహకరించగా, ఆ సాక్ష్యాలను ఈడీ ధృవపరుచుకుంది.
బీఆర్ఎస్కు, బీజేపీకి లోపాయికారీ సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో, అదీ లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన బీజేపీ, సరిగ్గా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్నవేళ, పకడ్బందీగా ఈడీతో కవిత ఇంటిపై దాడి చేసి, సాయంత్రానికి అరెస్టు చేసి, ఢిల్లీకి తరలించింది.
ఇక తన ఢిల్లీ ఆఫీసులో విచారణ ప్రారంభించిన ఈడీ, కవిత ఏది కాదన్నా, దానికి సంబంధించిన సాక్ష్యం చూపిస్తూ, నోరు మూయిస్తున్నారు.
నిందితులందిరినీ కలిపి విచారించే కార్యక్రమం నేడో, రేపో జరుగనుంది.
పనిలో పనిగా, కవిత భర్త అనిల్‌ను, తన అసిస్టెంట్లను కూడా ఈడీ విచారణకు పిలిపించింది.
జరుగబోయే పర్యవసానాలను ఊహిస్తే, కవిత జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏడాదిన్నరగా తీహార్ జైలులోనే ఉన్న సిసోడియాకు ఇంతవరకు బెయిల్ లభించకపోవడం, కవితకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలుండటంతో కవిత కూడా ఇప్పట్లో బయటకొచ్చే అవకాశం కనుచూపుమేరలో కనబడటంలేదు.
కేటీఆర్, హరీశ్ ఢిల్లీలోనే తిష్ఠవేసి కూర్చున్నా, సుప్రీంలో కేసులు వేసినా ఊరట దక్కేట్టు లేదు.
కవిత అరెస్టు తమకు సానుభూతిని తెచ్చిపెడుతుందని బీఆర్ఎస్ భావించినప్పటికీ, ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కనబడటంలేదు.
కవిత పట్ల ఎవరి నుంచీ సానుభూతి లభించడం లేదు.
కారణం, ఒక మహిళ అయ్యుండీ, ఇలా మద్యం దందాలో దూరడం స్వతహాగా మహిళలకు రుచించదు.
అందునా, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఇంత నీచస్థాయికి దిగజారడం ఊహించడానికి కష్టంగా అనిపిస్తోంది.
పైగా అప్పట్లో తనిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అయితే మద్యనిషేధం తెస్తానని అన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా పరుగులు పెడుతోంది.
అసలే పార్టీ పరిస్థితి ఘోరంగా పడిపోయింది.
ఇప్పుడు పార్టీలో ఎవరు ఉన్నారో, ఎవరు వెళ్లారో, ఇంకా ఎవరు వెళ్తారో తెలియని స్థితి.
ఓ పక్క లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి.
కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చుంటే, కేటీఆర్, హరీశ్ ఢిల్లీలో ఉన్నారు.
ఇప్పుడు పార్టీని పట్టించుకునే నాథుడే లేడు.
ఇక వీళ్లు ఎన్నికల్లో ఏం పోటీ చేస్తారు?
ఎన్ని సీట్లు గెలుస్తారు?
అడవి లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమన్నట్లు, ఆర్ఎస్ ప్రవీణ్‌ను తెచ్చుకున్నారు.
తాదూర సందులేదు, మెడకో డోలులా ఆయన రాక పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేకపోగా, నష్టం తెచ్చే అవకాశాలే ఎక్కువ.
ఎంతటి విషాదం?
తెలంగాణ ఉద్యమాన్ని కొలిమిలా రగిలించి, ప్రజలను విప్లవం దిశగా నడిపించిన పార్టీ, పదేళ్లు నిరాటంకంగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ఓడిపోయిన రెండు నెలలకే అవసానదశకు చేరుకోవడమంటే నమ్మబుద్ధి కావడంలేదు.
పది లక్షల మంది సభ్యులు, 3వేల కోట్ల నిధులు, ఆస్తులు, అన్ని జిల్లాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఆఫీసులుండి ఏం చేయలేని అయోమయస్థితి.
అపరచాణక్యుడు, మేరునగధీరుడుగా పేరుగాంచిన కేసీఆర్, పార్టీని అనాథను చేసి, చడీచప్పుడూ లేకుండా ఫాంహౌస్‌లో కూలబడ్డాడంటే ఏమనుకోవాలి?
దురదృష్టమా, కర్మఫలమా, స్వయంకృతమా..?
రేపు ఎన్నికలలో ఒక్క సీటూ గెల్చుకోలేకపోతే, ఇక పార్టీ లేదనే అర్థం చేసుకోవాలి.
అంత గొప్ప ఉత్థానం కలిగిన బిఆర్ఎస్, ఇంత హీనమైన పతనానికి దగ్గరవడం బాధాకరం.
కాల మహిమ ముందు ఏ సంక్షేమాలు, యజ్ఞాలు, యాగాలు, గుళ్లు నిలబడలేవని మరోసారి నిరూపితమవుతోంది.
అందరూ కాలచక్రంలో బందీలే.