నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, తెలుగు బిగ్ బాస్ ఫేం, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మొదట నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మహేష్ కు చికిత్స అందించగా… ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో చేరే సమయానికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించారు.
అయితే, ప్రమాద తీవ్రతకు మహేశ్ రెండు కళ్లు తీవ్రంగా గాయపడ్డాయని, వాటికి సోమవారం శస్త్రచికిత్స నిర్వహించనున్నారని తెలుస్తోంది. మహేశ్ ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయిందని వైద్యులు చెబుతున్నాట్లు మహేశ్ మేనమామ ఎం.శ్రీరాములు వెల్లడించారు. అయితే, ప్రమాదం వల్ల మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగలేదు కాబట్టి మహేశ్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని మీడియాకు ఆయన తెలిపారు.
మహేశ్ ప్రయాణిస్తున్న ఇన్నోవా…ఓ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ మహేశ్ తల, కళ్లు, ముక్కుకు గట్టి దెబ్బలు తగలడంతో ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, కత్తి మహేశ్ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో పవన్ ఫ్యాన్స్, మహేశ్ ల మధ్య తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే, గతం గత: అని…పవన్ ఫ్యాన్స్…మానవత్వంతో మహేశ్ కోలుకోవాలని పోస్టులు పెడుతుండడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.