అమెరికాలో జరిగిన నేషనల్ క్రికెట్ లీగ్ టోర్నీలో తెలుగు తేజం(ఎన్నారై) కార్తీక్ గట్టేపల్లి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచి సత్తా చాటాడు. అమెరికాలోని డల్లాస్ లో నివసిస్తున్న గట్టేపల్లి లక్ష్మానంద్ సాగర్, శ్రీమతి అపర్లల కుమారుడైన కార్తీక్ ఈ టోర్నీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. హైదరాబాద్ లో నివసిస్తున్న డాక్టర్ జయసాగర్ గట్టేపల్లి, శ్రీమతి శకుంతలల మనవడైన కార్తీక్ తన బౌలింగ్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. ఈ టోర్నీలో హ్యాట్రిక్ వికెట్లు సాధించి ఔరా అనిపించాడు.
లెజెండరీ క్రికెటర్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. 4/17 బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ తో మొత్తం 12 వికెట్లు సాధించి తన జట్టును ఎన్నో మ్యాచ్ లలో గెలిపించాడు. తన సొంతగడ్డ డల్లాస్ లో జరిగిన ఫైనల్లో బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా రాణించి కళ్లు చెదిరే క్యాచ్ పట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కార్తీక్ గట్టేపల్లి కొంతకాలంగా టీ20 క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎడమ చేతివాటం బౌలర్, బ్యాట్స్ మెన్ అయిన కార్తీక్ ఆల్ రౌండర్ గా నార్త టెక్సాస్ క్రికెట్ అసోసియేషన్ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2018 ఐపీఎల్ ఎడిషన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు దగ్గర శిక్షణ పొందాడు. 2018లో అమెరికా క్రికెట్ జట్టు తరఫున అండర్ -19 క్రికెట్ ఆడాడు. 2021లో హూస్టన్ టీ20 టోర్నమెంట్ లో బెస్ట్ బౌలర్ అవార్డును కార్తీక్ కైవసం చేసుకున్నాడు. త్వరలోనే అమెరికా క్రికెట్ జట్టు తరఫున కార్తీక్ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే అవకాశముంది.