మనదేశంలో కొందరు ప్రజా ప్రతినిధులపై మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే, ఆ ఆరోపణలు నిజం అని తేలి….సదరు ప్రజాప్రతినిధులకు శిక్ష పడ్డ దాఖలాలు మాత్రం కొన్నే ఉన్నాయి. కొంతమంది ప్రజా ప్రతినిధులు సదరు వీడియోలో ఉన్నది తాము కాదంటే కాదని చెప్పి తప్పించుకుంటే…మరికొందరేమో అది మార్ఫింగ్ వీడియో అంటూ కేసు క్లోజ్ చేసేస్తారు.
ఇదే కోవలోకి తాజాగా కర్ణాటక జలవనరుల శాఖా మంత్రి రమేశ్ జార్కిహొళి కూడా వస్తారు ఒక మహిళతో రమేశ్ సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయతే, యథావిధిగా ఆ వీడియోలో ఉన్నది తాను కాదన్న రమేశ్….అది తనే అని నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు.
త్వరలో కర్ణాటకలో జరగబోతోన్న ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేత అయిన రమేశ్ ఈ వ్యవహారంలో ఇరుక్కోవడంతో బీజేపీ అధిష్టానం ఇరకాటంలో పడింది. మంత్రి రమేశ్ జార్కిహొళి ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను దినేశ్ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త మీడియాకు విడుదల చేశారు. కేపీటీసీఎల్‌లో (కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్) ఉద్యోగం ఇప్పిస్తానని బెంగుళూరుకు చెందిన ఓ యువతిని ఆయన లొంగదీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఉద్యోగం ఇప్పించకపోవడంతో ప్రతీకారంగా బాధితురాలే ఈ వీడియో తీయించి విడుదల చేశారని ప్రచారం జరుగుతోంది. షార్ట్ ఫిల్మ్ తీసేందుకు రమేశ్ తో సదరు యువతి సాన్నిహిత్యం పెంచుకున్నట్టు మరో ప్రచారం జరుగుతోంది. రమేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వీడియో బయటపెట్టిన దినేశ్ కల్లహళ్లి బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
త్వరలో జరగబోతోన్న అసెంబ్లీ సమావేశాలకు ముందే రమేశ్ తో రాజీనామా చేయించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అయితే, తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ,ఆ వీడియోను విడుదల చేసిన వ్యక్తి, అందులో ఉన్న యువతి తనకు తెలీదని రమేశ్ అంటున్నారు. తప్పు చేసిన ట్టు రుజువైతే ఉరిశిక్షకూ సిద్ధమని మంత్రి రమేశ్ చాలెంజ్ చేశారు. మరి, ఈ వివాదానికి బీజేపీ పెద్దలు ఏవిధంగా చెక్ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.