బాలీవుడ్ లెజెండరీ హీరోల్లో ఒకడైన సైఫ్ అలీఖాన్ మీద ఇటీవల జరిగిన దాడి మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురి చేసింది. గుర్తు తెలియని దుండగుడు ఆయన ఇంట్లోకి ప్రవేశించి.. ఆయన మీద ఏకంగా ఆరు కత్తి పోట్లు పొడవడం సంచలనం రేపింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సైఫ్ వేగంగా కోలుకుంటున్నాడు. మరోవైపు పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సైఫ్ సతీమణి కరీనా కపూర్‌ను విచారణకు పిలిచి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ సందర్భంగా కరీనా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. దొంగతనం కోసమే వచ్చినట్లుగా భావిస్తున్న దుండగుడు తమ ఇంటి నుంచి ఏమీ తీసుకుని వెళ్లలేదని కరీనా వెల్లడించినట్లు తెలిసింది. ఇంకా పోలీసుల దగ్గర కరీనా ఏం చెప్పిందంటే..?
‘‘దాడి చేసిన సమయంలో దుండగుడు చాలా ఆవేశంగా ఉన్నాడు. మా చిన్నబ్బాయి జేహ్, అతడి కేర్ టేకరలను కాపాడే ప్రయత్నంలో సైఫ్.. దుండగుడితో పోరాడాడు. ఈ క్రమంలోనే అతను సైఫ్ మీద దాడికి పాల్పడ్డాడు. అతను దాదాపు ఆరుసార్లు సైఫ్‌ను పొడిచాడు. వెంటనే పిల్లల్ని పై ఫ్లోర్ లోకి పంపించేశాం. దాడి తర్వాత ఎంతో కంగారు పడ్డాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ధైర్యం చెప్పడానికి మా అక్క కరిష్మా కపూర్ వచ్చింది. వెంటనే నన్ను తన ఇంటికి తీసుకెళ్లింది. దాడి చేసిన తర్వాత చూస్తే దుండగుడు ఇంటి నుంచి ఏమీ తీసుకెళ్లలేదని అర్థమైంది’’ అని కరీనా కపూర్ వెల్లడించింది. దాడి జరిగి మూడు రోజులు అవుతున్నా ఇంకా నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. 20 బృందాలుగా విడిపోయి ముంబయి పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర అతను చివరిసారి కనిపించినట్లు చెబుతున్నారు. ఘటన తర్వాత అతను లోకల్ ట్రైన్లో ప్రయాణించినట్లు కూడా పోలీసులు తెలుసుకున్నారు. కబూతర్ ప్రాంతంలో అతను సంచరిస్తున్నట్లుగా భావించి అక్కడే అతడి కోసం గాలిస్తున్నారు.