కన్నడ సినిమా కు సంబంధించినంత వరకు అతి పెద్ద మలుపు కేజీఎఫ్ సినిమానే. కానీ తాజాగా కాంతార సినిమా అంతకుమించిన రికార్డులు క్రియేట్ చేసింది.
కేజీఎఫ్ శాండిల్ వుడ్ స్థాయికి మించి ఎన్నో రెట్లు ఆ సినిమా వసూళ్లు రాబట్టింది. కేజీఎఫ్-2 ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లు సాధించిందంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
సమీప భవిష్యత్తులో ఆ సినిమాను కొట్టే కన్నడ సినిమా రాదని.. దాన్ని అందుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇటీవలే విడుదలైన కాంతార మూవీ కేజీఎఫ్ మూవీని దాటేయడం విశేషం.
ఐతే కాంతార దాటింది కేజీఎఫ్ వసూళ్లను కాదు. ఫుట్ ఫాల్స్‌ను. అంటే కేజీఎఫ్ కంటే కూడా ఈ సినిమాను ఎక్కువ మంది థియేటర్లలో చూశారన్నమాట. మరి అంత మంది చూస్తే వసూళ్లను దాటకపోవడం ఏంటి అనిపించొచ్చు.
కానీ కేజీఎఫ్ మూవీకి టికెట్ల రేట్లు భారీగా ఉన్నాయి. అందువల్ల అది ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.
కాంతారకు దాంతో పోలిస్తే చాలా తక్కువ రేట్లున్నాయి. ఇక కాంతార దాటింది కేజీఎఫ్ వరల్డ్ వైడ్ ఫుట్ ఫాల్స్‌ను కాకపోవచ్చు. కర్ణాటక లేదా ఇండియా వరకు ఫుట్ ఫుల్స్ ఎక్కువ ఉండి ఉండొచ్చు. ఈ రికార్డును నమ్మకపోవడానికేమీ లేదు. ఎందుకంటే ఈ ప్రకటన చేసింది కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలె ఫిలిమ్సే. ఆ సంస్థే కాంతార సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసింది.
కాంతారకు ఎలివేషన్ ఇవ్వడానికి తమ సంస్థకు అంత పేరు, డబ్బు తీసుకొచ్చిన కే.జీఎఫ్ సినిమాను తక్కువ చేసే అవకాశం లేదు. కేజీఎఫ్ లాగా మాస్ సినిమా కాకపోయినా కాంతార అంటే కంటెంట్ బేస్డ్ మూవీ ఈ స్థాయిలో ఆదరణ సంపాదించుకోవడం అనూహ్యం.