దివంగత సీఎం వైయస్సార్ హయాంలో తన తండ్రిని అడ్డుపెట్టుకొని జగన్ భారీగా అక్రమాస్తులు కూడాబెట్టారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ హయాంలో క్విడ్ ప్రోకోకు పాల్పడిన జగన్ వేలకోట్ల ఆస్తులు సంపాదించారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ కేసుల్లోనే జగన్ 16 నెలలపాటు జైలు శిక్ష కూడా అనుభవించారని దుయ్యబడుతుంటారు. అయితే, ఏపీకి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా జగన్ ధనదాహం తీరలేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు.
జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టీడీపీతో పాటు విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ పక్క అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్న జగన్…మరోపక్క తన ధన దాహంతో ఆస్తులు పెంచుకుంటూ పోతున్నారని విపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలన్నదే జగన్ లక్ష్యం అని, అందుకే రాష్ట్ర సంపాదనంతా ఏకీకృతం చేసి జగన్ దోచుకుంటున్నారని కన్నా షాకింగ్ కామెంట్లు చేశారు.
జగన్ పాలనలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందని, ఏపీలో జగన్ సర్కార్ స్వయంగా లిక్కర్ వ్యాపారం చేస్తోందని కన్నా సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో రాష్ట్ర ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చిందని, ఈ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని కన్నా లక్ష్మీనారాయణ ప్రార్ధించారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చిన జనాల్ని మోసం చేస్తున్నారని కన్నా దుయ్యబట్టారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని కన్నా ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉండాలని ఆకాంక్షించారు. కానీ, దురదృష్టవశాత్తు జగన్ వంటి ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించడం చేతకాకుంటే జగన్ తప్పుకోవాలని, బీజేపీ ఆ ప్రాజెక్టును చేపడుతుందని కన్నా అన్నారు.