2019 ఎన్నికల ప్రచారంలో ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ ప్రతిపక్ష నేత జగన్ జనాల దగ్గర ఓట్లు అడిగిన సంగతి తెలిసిందే. అడగాడు కదా అని జగన్ కు ఒక్క చాన్స్ ఇచ్చిన జనానికి…రెండున్నరేళ్ల పాలనలో జగన్ పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అప్పుల ఊబిలో ఏపీని ముంచిన జగన్…రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి నెత్తిపై సుమారు 5 లక్షల రూపాయల అప్పు మిగిల్చారని విపక్షాలు లెక్కలతో సహా దుమ్మెత్తి పోస్తున్నాయి. కొందరికి సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లాలు పంచేందుకు ట్యాక్స్ పేయర్ల డబ్బును జగన్ దుబారా చేస్తున్నారని మండిపడుతున్నాయి.
పరిమితిలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా దిశగా జగన్ నడిపిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు మాజీ ఐఏఎస్ ఐవైఆర్ వరకు గణాంకాలతో సహా బట్టబయలు చేస్తున్నా సరే జగన్ మాత్రం అప్పు చేసి పప్పుకూడు పెడుతూనే ఉన్నారు. కాగ్ లెక్కల ప్రకారం 2021-22లో 9 నెలలకు రెవెన్యూ లోటు రూ.45,900 కోట్లు అని ఉంటే…2022-23 బడ్జెట్లో మాత్రం రెవెన్యూ లోటును రూ.19,545 కోట్లుగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన చూపించడంపైనా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా సోమవారం నాడు జరిగిన రాజ్యసభ సమావేశాల్లో ఏపీ ఆర్థిక దుస్థితిని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రస్తావించారు. రాజధాని అమరావతి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపైనా కనకమేడల సభలో మాట్లాడారు. రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో తక్షణమే ఆర్ధిక అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెంటనే ఆర్టికల్- 360ని ప్రయోగించాలని, శాసన సభ ఆమోదం లేకుండా రూ.1.11 లక్షల కోట్లను ఖర్చు చేశారని కనకమేడల ఆరోపించారు.
సుమారు రూ.48 వేల కోట్లకు లెక్కలు చూపడం లేదని, కోర్టుల తీర్పులపై సభలో చర్చలు పెడుతున్నారని కనకమేడల జగన్ పరువును పెద్దల సభలో తీశారు. జగన్ సర్కారు తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన కనకమేడల…స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి వెనక్కు తగ్గాలని విన్నవించారు.
కాగా, ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా స్పందించారు. ఏపీలో ఆర్థిక అత్యయిక పరిస్థితి ఆర్టికల్ 360ని విధించాలని మరోసారి కేంద్రాన్ని కోరారు. ఆర్థిక పరిస్థితిపై సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. ప్రభుత్వ లొసుగులు బయటపెడుతున్నామన్న కారణంతోనే వైసీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాగ్ నోటింగ్స్ ఆధారంగానే తాను విమర్శలు చేస్తున్నానని, ఆ నోటింగ్స్ పై బుగ్గన జవాబివ్వడంలేదని విమర్శించారు. దీనినిబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందనేది స్పష్టమవుతోందని తెలిపారు.