విజయవాడ రాజకీయాల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వైసీపీకి అండగా ఉన్న కమ్మ సామాజికవర్గం ఆ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటైంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం రెడీ చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. టీడీపీని ఓడిస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. విజయవాడ తూర్పులో టీడీపీని ఓడించి వైసీపీని గద్దెనెక్కిస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. కేశినేని నాని వ్యూహాలకు చెక్ పెడుతూ. టీడీపీ కూడా అదే రేంజ్లో చక్రం తిప్పింది.
దీంతో వైసీపీలో ఇప్పటి వరకు ఉన్న ఇద్దరు కీలక నాయకులు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు.. టీడీపీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. వీరిలో విజయవాడ వైసీపీ వ్యవహారాల ఇంచార్జ్ బొప్పన భవకుమార్, విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఉన్నారు. వీరితోపాటు.. కమ్మ వర్గానికి చెందిన క్షేత్రస్థాయి నాయకులు కూడా టీడీపీకి జైకొట్టేందుకు రెడీ అయ్యారు. వీరిని విజయవాడకు చెందిన కేశినేని చిన్ని. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశారు. త్వరలోనే పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
ఏం జరుగుతుంది?
విజయవాడలో ఇప్పటి వరకు.. కమ్మ సామాజికవర్గంలో 60 శాతం టీడీపీవైపు ఉండగా.. తూర్పు నియోజకవర్గంలోని 40 శాతం దాకా వైసీపీని సమర్థిస్తున్నారు. ఇదే గత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ గెలుపును కష్టసాధ్యం చేసింది. చాలా టఫ్ ఫైట్‌ను ఎదుర్కొనాల్సి వచ్చింది. పైగా యలమంచిలి రవి వర్గం.. ఇక్కడ బలంగా ఉంది. అదేవిధంగా మాజీ కార్పొరేటర్.. బొప్పన రవికుమార్ కూడా తన వర్గాన్ని వైసీపీవైపు మళ్లించారు.
అయితే..ఇ ప్పుడు ఈ వర్గం.. టీడీపీకి జైకొట్టడంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న 40 శాతం ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు బదాబదలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కమ్మ వర్గం అంతా ఒక్కటి కావడం టీడీపీకి ప్లస్ అవుతుండగా.. వైసీపీకి మైనస్ అవుతుందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఇది ప్రస్తుత ఎంపీ కేశినేని పాలిటిక్స్‌కు చెక్ పెడుతుందనే అంచనాలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.