ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ కాలం. ఎవరు ఎవరిని నియంత్రించలేరు. తమకున్న పేరు ప్రఖ్యాతులతో తమను నిలదీసే వారిని నిలువరించలేని పరిస్థితి. దీనంతటికి కారణం సోషల్ మీడియాతో పాటు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ప్లాట్ ఫాంలు. ఎవరు ఏ అభిప్రాయాన్ని అయినా వెలువరించొచ్చు. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు మొదలు రాజకీయ విశ్లేషణలు.. ఇలా అది.. ఇది అన్న తేడా లేకుండా దేని మీదైనా స్పందించటం ఇప్పుడు కామన్ అయిపోయింది. తాజాగా బాలీవుడ్ ను మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన అమీర్ ఖాన్ – కిరణ్ రావుల విడాకుల వ్యవహారంపై తాజాగా ఒక క్రిటిక్ చేసిన బుల్లి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అమీర్ ఖాన్ తీరును తీవ్రస్థాయిలో ఎద్దేవా చేసిన అతగాడు.. గతంలో అతడి విడాకుల ఎపిసోడ్ లో చాలామందికి పట్టని పలు అంశాల్ని ప్రస్తావించి సంచలనంగా మారారు. ఇంతకూ కిరణ్ రావుతో అమీర్ విడాకులు ఎందుకు తీసుకుంటున్నారన్న విషయాన్ని సూటిగా చెప్పకుండా.. సైటిరికల్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అమీర్ తాజా విడాకులకు కారణం దంగల్ నటి ఫాతిమాతో ఎఫైర్ అనే విషయాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేస్తూ.. కిరణ్ రావుకు న్యాయం జరగాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.
మొదటి భార్య రినా దత్తాతో పదిహేనేళ్లు.. కిరణ్ రావుతో పదహారేళ్లు .. ఇలా ఎందుకు చేశావ్ అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారంటూ.. సినీ క్రిటిక్ గా యూ ట్యూబ్ లో సుపరిచితుడైన కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్ కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారు? అన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చూసినప్పుడు ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై తమ అభిప్రాయాల్ని ఇంత తెలివిగా చెప్పేయటమే కాదు.. పంచ్ లు వేసి తాట తీయటం ఎలా అన్న విషయాన్ని భలేగా చెప్పేశారని చెప్పక తప్పదు. అమీర్ విడాకులు వ్యవహారంపై ఆయన మాటల్నియథాతధంగా చెబితే..
‘అమీర్ నిజాయితీపరుడని అందరూ అంటారు. ఆయన నిజాయితీగా విడాకులు ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. అమీర్ లాంటి స్టార్ హీరో కిరణ్ రావు లాంటి సాధారణ మహిళనుపెళ్లి చేసుకోవటం ఏమిటని అప్పుడే అనుకున్నా. ఎందుకంటే ఆయన ఒక సూపర్ స్టార్. ఆయన తలుచుకుంటే కత్రినా కైఫ్ వంటి అందమైన హీరోయిన్.. ఫాతిమా సనా లాంటి వారిని పెళ్లి చేసుకోవచ్చు’
‘కానీ.. కళ్లజోడు లేకపోతే కనీసం చూడలేని.. సర్వసాధారణమైన కిరణ్ రావును అమీర్ పెళ్లి చేసుకున్నాడని విని షాక్ అయ్యా. అమీర్ ఆమెనే ఎందుకు పెళ్లి చేసుకున్నాడని బాధ పడ్డా. అమీర్ డబ్బు మనిషి కాదు. అందుకే మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చే ముందు ఎలాంటి భరణం.. డబ్బు చెల్లించకుండానే ఆ బంధాన్ని విడిపించుకున్నాడు. ఇప్పుడు అమీర్ కు డబ్బుకు కొదవ లేదు. ఆయన కచ్ఛితంగా కిరణ్ రావుకు భరణం చెల్లించాల్సిందే. కిరణ్ రావు కళ్లద్దాల మొహం చూడలేకపోతున్నానని.. పదిహేనేళ్లు ఆమెను చూసి బోరు కొట్టటం వల్లే విడాకులు తీసుకున్న నిజానని అమీర్ ఖాన్ ఒప్పుకోవాలి’ అంటూ అమీర్ ను తనదైన శైలిలో వాయించేశాడు. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై ఎలా పంచ్ లు వేయొచ్చు అన్న విషయం తాజా వీడియో చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.