‘నాయకుడు’ లాంటి ఆల్ టైం గ్రేట్ మూవీని అందించిన కమల్ హాసన్, మణిరత్నంల లెజెండరీ కాంబినేషన్లో 38 ఏళ్ల తర్వాత రాబోతున్న చిత్రం.. థగ్ లైఫ్. ఈ సినిమా మొదలైనపుడు, మేకింగ్ దశలో మరీ హైపేమీ లేదు కానీ.. ట్రైలర్ లాంచ్ అయ్యాక కావాల్సిన బజ్ అంతా వచ్చేసింది. వచ్చే నెల 4న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం భారీగా రిలీజ్ కాబోతోంది. స్వయంగా కమల్, మణిరత్నం కలిసి నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్మకాల విషయంలో ఆ ఇద్దరూ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు.
సౌత్ సినిమాల్లో చాలా వరకు థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కానీ ఈ సినిమాను మాత్రం 8 వారాల తర్వాతే డిజిటల్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని రిలీజ్‌కు ముందే కమల్ ధ్రువీకరించాడు. థియేటర్ల వ్యవస్థను కాపాడాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరి అని కమల్ అంటున్నారు. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకే ఓటీటీలో విడుదల చేస్తే ఎక్కువ రేటు వస్తుంది. కానీ దానికి ఆశపడడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. నాలుగు వారాలు ఆగితే ఇంట్లో కూర్చుని సినిమా చూడొచ్చు కదా అనే ఆలోచన ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది.
ఈ నేపథ్యంలోనే కమల్, మణిరత్నం థియేటర్ల సంక్షేమం కోసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండేలా డిజిటల్ డీల్ చేసుకున్నారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం చేసిందే అని.. ఓటీటీ సంస్థతో కూర్చుని మాట్లాడి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నామని.. అప్పుడే ఇండస్ట్రీ ఆరోగ్యకరంగా ఉంటుందని కమల్ అన్నారు. ‘థగ్ లైఫ్’కు థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కమల్‌తో పాటు శింబు, త్రిష, జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషించిన ‘థగ్ లైఫ్’ గ్యాంగ్‌స్టర్ డ్రామా కథతో తెరకెక్కింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడీ చిత్రానికి. జూన్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.