తెలంగాణలో తమ పార్టీ ప్రజారంజకపాలనను అందిస్తోందని టీఆర్ ఎస్ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. బంగారు తెలంగాణ తమ పార్టీతోనే సాధ్యమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతుంటారు. ఇక, దేశంలో మరే రాష్ట్రంలో అమలుకాని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని గులాబీ బాస్ పలుమార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా తన సొంత పార్టీపై కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పాలనపై కే.కవిత తాజాగా పెదవి విరిచిన వైనం తెలంగాణలో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై శాసనమండలిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కవిత నిలదీయడం సంచలనం రేపింది.
ప్రజా ప్రతినిధులకు కనీసం కూర్చోడానికి కుర్చీకూడా లేదని కవిత సూటిగా ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి చొరవ తీసుకోవాలని కవిత సూచించారు. అంతేకాదు, ఆ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మండలాలు ఏర్పాటైనప్పటికీ ఎంపీపీలకు తగిన ఆఫీసులు లేవని కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజువారీ అధికారిక విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మరి, ఈ వ్యవహారంపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.