2019లో జగన్‌కు ఓటేశాను.. 2024లో మాత్రం.. : కడప టాక్ మారుతోంది…!
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయ కలకలం రేగుతోంది. ప్రజల మనిషిగా.. ప్రజా వైద్యురాలి గా గుర్తింపు పొందిన డాక్టర్ నూరి పర్వీన్.. పొలిటికల్‌గా కూడా ప్రభావితం అవుతున్న విషయం తెలిసిందే. రాజకీయంగా డాక్టర్ పర్వీన్‌కు మంచి పేరుంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా.. ఆమె మాట.. వాదన.. వ్యాఖ్యలు .. రాజకీయాల్లో చర్చకు వస్తుంటాయి.
గత 2019 ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో డాక్టర్ పర్వీన్.. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. జగన్ కోసం అందరం నిలబడదామని అప్పట్లో ఆమె పిలుపునిచ్చారు. ఆ వీడియోలను వైసీపీ జోరుగా ప్రచారం చేసుకుంది. ఇది అంతో ఇంతో ఎన్నికల్లో ప్రభావం కూడా చూపించింది. అయితే.. ఇప్పుడు అదే డాక్టర్ పర్వీన్.. జగన్‌కు వ్యతిరేకంగా.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
“అవును 2019 ఎన్నికల్లో నేను వైసీపీకి ఓటేశాను. జగన్ సర్‌ను సీఎంగా చూడాలని అనుకున్నా. కానీ, ఏం చేశారు? ఇప్పుడు ఇంటి రెంట్ కంటే కూడా విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. ఏ మొహం పెట్టుకుని మళ్లీ వైసీపీకి ఓటేయాలని పిలుపునిస్తాను. నేను మాత్రం ఓటేస్తాను? “ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
“2019 లో యువత ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, ప్రత్యేక హోదా, విభజన హామీలు లాంటివి సాధిస్తాడని, యువతకు అన్నింట్లో అధిక ప్రాధాన్యం ఇస్తాడని, తండ్రిని మించి ఏదో చేసేస్తాడని, ఇలా ఎన్నో అనుకుని ఓటేశాం. నా దగ్గరకు వచ్చే పేషంట్లకు, వారి బంధువులకు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. కానీ, ఇప్పుడు అవేవీ చేయలేదు. ఐదేళ్లు అయిపోతున్నాయి. వీటిని సాధిస్తారనే నమ్మకం కూడా లేదు. నేను వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటేయను“ అని డాక్టర్ పర్వీన్ తన వీడియోలో స్పస్టం చేయడం గమనార్హం. ఆమె రాజకీయంగా నాయకురాలు కాకపోయినా.. జిల్లాలో 10 రూపాయల డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ఆమె వాదన ప్రభావం చూపుతుందని అంటున్నారు పరిశీలకులు.