నిప్పుకు చెద పట్టినట్టుగా.. న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో వెలుగు చూసిన నోట్ల కట్టలు.. వాటి కి నిప్పు అంటుకున్న వ్యవహారం.. దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పదవి నుంచి దింపేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు, లేదా సుప్రీంకోర్టున్యాయమూర్తులపై అభియోగాలు వచ్చినప్పుడు.. వారంతట వారు తప్పుకొంటారన్నది న్యాయ సూత్రం.
అందుకే.. న్యాయమూర్తుల, ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన అధికారాలను మాత్రమే ప్రస్తావిం చిన రాజ్యాంగం.. వారిని ఉద్యోగాల నుంచి ఎలా తొలగించాలో స్పష్టం చేయలేదు. అయితే.. పార్లమెంటు ద్వారా వారిని తొలగించే ఒక్క ఒక్క అవకాశం ఇచ్చింది. దీనికి కారణం.. ఆయా పదవుల్లో ఉన్నవారు.. పార దర్శకంగా ఉంటారని.. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటారని.. రాజ్యాంగ నిర్మాతలు అభిలషించి ఉంటారు.
కానీ, రాను రాను న్యాయ వ్యవస్థ కూడా.. దారితప్పిన పరిస్థితి అనేక సందర్భాల్లో కనిపించింది. ఈ క్రమం లోనే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మను పార్లమెంటు ద్వారా అభిశంసిం చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా సమాచారం చేరవే సింది. వాస్తవానికి.. కీలక పదవుల్లో ఉన్న వారు వారంతట వారే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వైదొల గాలి. కానీ.. అలాంటి పరిస్థితి కనిపించలేదు.
కొన్నాళ్ల కిందట ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత్ వర్మ.. ఇంట్లో ఒకరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే సగం కాలిన నోట్ల కట్టల బస్తాలు వెలుగు చూశాయి. అనంతరం .. ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. చివరకు.. ఆయనను పదవి నుంచి దిగిపోవాలని సుప్రీంకోర్టు కూడా సూచించింది. అయినా.. ఆయన అక్కడే ఉన్నారు. పైగా తాను తప్పు చేయలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ఆయనను పక్కన పెట్టనుంది. కాగా.. దేశంలో ఇలా.. ఇప్పటి వరకు ఇద్దరిని మాత్రమే అభిశంసించడం గమనార్హం.